తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించడం అభినందనీయం అని చెప్పారు. దీర్ఘకాలికంగా పెండింగులో ఉన్న మిడ్ మానేరు బాధితుల సమస్యలను లేఖలో ప్రస్తావించారు బండి సంజయ్. ఒక్కో బాధిత కుటుంబానికి ఇండ్ల నిర్మాణం కోసం రూ. 5 లక్షల 4 వేలు చెల్లించాలని లేఖలో కోరారు.
నీలోజిపల్లి నుండి నందిగామ, ఆగ్రహారం వరకు ఇండస్ట్రీయల్ కారిడార్‌ను, స్కిల్ డెవలప్మెంట్ కాలేజీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు బండి సంజయ్. అర్హత లేకున్నా మిడ్ మానేరు ముంపు ప్యాకేజీ పరిహారం తీసుకున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ సహా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తక్షణమే సంబంధిత శాఖ మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణలో ప్రజా అకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తూ.. ప్రజాస్వామ్యబద్దంగా పని చేయాలని సూచించారు.