కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రధానమైన 6 హామీల అమలు కోసం దరఖాస్తుల స్వీకరణను స్వాగతిస్తున్నామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీనంగర్ ఎంపి బండి సంజయ్ అన్నారు. డిసెంబర్ 25వ తేదీ సోమవారం కరీంనగర్ లో బండి సంజయ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రకటించిన 6 హామీలకు దరఖాస్తులు చేసుకోవాలంటున్నారు సరే.. మరి కొత్త రేషన్ కార్డులేవి? అని ప్రశ్నించారు.
రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షలకు పైగా రేషన్ కార్డు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ఇంకా లక్షలాది మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు సిద్దంగా ఉన్నారని.. తక్షణమే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించాలని సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
6 గ్యారంటీల హామీలను కొత్త రేషన్ కార్డుదారులకు కూడా వర్తింపజేయాలని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా లబ్దిదారులను గుర్తించేందుకు అన్ని పార్టీలను భాగస్వాములను చేయాలన్నారు. ముందు 6 గ్యారంటీల అమలుకు నిధులు ఎలా సమకూరుస్తారో కూడా చెప్పాలని.. అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణను ఎట్లా గట్టెక్కిస్తారో సమాధానం చెప్పాలన్నారు. ముస్లిం దేశాలే నిషేధించిన తబ్లిక్ జమాతేకు నిధులెట్లా ఇస్తారని ప్రశ్నించారు.
గతంలో కోవిడ్ మహమ్మారి ప్రబలడానికి తబ్లిక్ జామాతే కారణమని.. ఉగ్రవాదులను తయారు చేసే సంస్థకు నిధులివ్వడం వెనుక ఉద్దేశమేంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి సంస్థలకు ప్రభుత్వం తక్షణమే నిధులను ఉపసంహరించుకోవాలని... ఈ సంస్థలను ప్రోత్సహిస్తే శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని బండి సంజయ్ అన్నారు.