రాజన్న సిరిసిల్ల, వెలుగు : బీజేపీని గెలిపిస్తేనే రాష్ట్రానికి కేంద్రం నుంచి అదనపు నిధులు వస్తాయని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలవాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. గురువారం సిరిసిల్లలో జరిగిన కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈనెల 28న కరీంనగర్ రానున్నారని తెలిపారు. కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని క్రియాశీల కార్యకర్తలతో నిర్వహించే సమ్మేళనంలో ఆయన పాల్గొంటారని చెప్పారు.
లోక్ సభ ఎన్నికల్లో తమ నాయకులపై పోటీ చేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని పేర్కొన్నారు. కేంద్రంలో మళ్లీ వచ్చేది మోదీ సర్కారే అని ధీమా వ్యక్తం చేశారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే మోదీతోనే సాధ్యమన్నారు. ఈ సమావేశంలో సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, గంగాడి కృష్ణా రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బొమ్మ జయశ్రీ, పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి, రాష్ట్ర నాయకులు మీసాల చంద్రయ్య, చెన్నమనేని వికాస్ రావు, ఆరెపల్లి మోహన్, బాస సత్యనారాయణ, బోయినిపల్లి ప్రవీణ్ రావు పాల్గొన్నారు.