కేసీఆర్, ఒవైసీ తోక ముడిచారు:బండి సంజయ్

  • మామ, అల్లుడి సంగతి చూస్తం: సంజయ్

కరీంనగర్, వెలుగు: సీఎం కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పిరికిపందలని, ఇద్దరూ తోక ముడిచారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. బీజేపీని నేరుగా ఢీకొట్టలేక బీఆర్ఎస్, ఎంఐఎం అగ్రిమెంట్‌‌తో ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ అంతటా ఎంఐఎం అభ్యర్థులను ప్రకటించి సత్తా చాటుతామని ప్రగల్భాలు పలికిన ఒవైసీ.. మాట తప్పి పిరికిపందలా పారిపోయారని ఎద్దేవా చేశారు.

 శనివారం కరీంనగర్‌‌‌‌ జూబ్లీనగర్ లోని శ్రీరామ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరై మాట్లాడారు. కరీంనగర్‌‌‌‌లో బీజేపీ గెలవడం తథ్యమని సీఎం కేసీఆరే చెబుతున్నారని, అందుకే బీఆర్ఎస్ అభ్యర్థికి చాలారోజుల పాటు బీఫామ్ కూడా ఇవ్వలేదన్నారు. ఓట్ల కోసం ఎంఐఎం టోపీ పెట్టుకుని దారుస్సలాం పోయి ఒవైసీకి మోకరిల్లిన చరిత్ర బీఆర్ఎస్ అభ్యర్థిదని దుయ్యబట్టారు. ఓట్ల కోసం దేనికైనా దిగజారే వ్యక్తిత్వం మంత్రి గంగుల కమలాకర్‌‌‌‌ది అని విమర్శించారు. 

6న సంజయ్ నామినేషన్

కరీంనగర్ నుంచి పోటీ చేస్తున్న బండి సంజయ్.. తన నియోజకవర్గంలో పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఈనెల 7 నుంచి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో.. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం వరకు, సాయంత్రం 6 నుంచి రాత్రి 10 వరకు రోజూ పాదయాత్ర చేయనున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేపట్టి.. ఎన్నికల ప్రచారం చేయనున్నారు. 

బీజేపీ అభ్యర్థుల కోసం ప్రచారానికి బండి సంజయ్ వెళ్లేందుకు ప్రత్యేకంగా హెలికాప్టర్‌‌‌‌ను పార్టీ కేటాయించింది. ప్రచారంలో భాగంగా 8, 9, 10వ తేదీల్లో ఎక్కడెక్కడ ప్రచారం చేయాలనే అంశంపై షెడ్యూల్ ను రూపొందించారు. సిరిసిల్ల, నారాయణపేట, ఖానాపూర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. ఇక ఈనెల 6న బీజేపీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా సంజయ్ నామినేషన్ వేయనున్నారు.