
- దాని తొలగింపు కోసం మేం ముందు నుంచీ పోరాడుతున్నం: బండి సంజయ్
- తెలంగాణ ఏర్పాటులో మా పార్టీది కీలక పాత్ర
- యువకుల ఆత్మహత్యలను సుష్మాస్వరాజ్ అడ్డుకున్నరు
- ఆవిర్భావ వేడుకలకు సోనియాను ఆహ్వానించి తమ నేతలను ఎందుకు ఇన్వైట్ చేయలేదని నిలదీత
న్యూఢిల్లీ, వెలుగు : తెలంగాణ లోగోలో చార్మినార్ ఉండటం కరెక్టు కాదని, దాని తొలగింపు కోసం తాము ముందు నుంచి పోరాడుతున్నామని బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ, ఎంపీ బండి సంజయ్ అన్నారు. అయితే, అమరవీరుల స్తూపంపై అందరి అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ నేతలు కీలక పాత్ర పోషించారని, యువకులు ఆత్మహత్య చేసుకోకుండా దివంగత నేత సుష్మాస్వరాజ్ అడ్డుకున్నారని ఆయన తెలిపారు. శనివారం ఎన్వీఎస్ ఎస్ ప్రభాకర్, వెదిరె శ్రీరాంతో కలిసి బండి సంజయ్ ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీని ఆహ్వానించారని, కానీ.. తెలంగాణ బిల్లును ఆమోదింపచేయడంలో కీలక పాత్ర పోషించిన బీజేపీ నేతలను ఎందుకు ఆహ్వానించలేదని ఆయన నిలదీశారు.
రాష్ట్రం నుంచి ఏఐసీసీకి ముడుపులు
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంలా మారిందని, తెలంగాణ నుంచి ముడుపులను ఏఐసీసీకి ముట్టజెప్పే క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడంపై విచారణను మధ్యలోనే నిలిపివేసి కొత్త డ్రామాకు తెరలేపారని బండి సంజయ్ ఆరోపించారు. ఆవిర్భావ వేడుకల్లో భాగంగా సోనియా గాంధీని తెలంగాణకు రప్పించి, కేసీఆర్ ను ఆహ్వానించి వారిద్దరూ వేదికను పంచుకునేలా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసిందన్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేసి ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కేసుల నుంచి కేసీఆర్ను తప్పిస్తారని చెప్పారు.
ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం
కేసీఆర్ చేసిన అవినీతి, అక్రమాలు బయటకు వస్తున్నాయని బండి సంజయ్ అన్నారు. ‘‘ఇప్పటికే కేసీఆర్ కూతురు కవిత జైలుకు పోగా... తాజా కేసుల్లో కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ కూడా జైలుకు పోయే పరిస్థితి ఉంది. అందువల్లే తన జోలికి రావద్దని, కేసులు పెట్టొద్దని.. దీనికి బదులు లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని కేసీఆర్.. కాంగ్రెస్ తో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో ఎవరికి ఏం ముట్టాలో అవి ముట్టాయి” అని సంజయ్ వ్యాఖ్యానించారు.