కరీంనగర్ సిటీ, వెలుగు : తనకు అంగ, అర్థ బలం లేకున్నా, రాజకీయ వారసత్వం లేకపోయినా కరీంనగర్ ప్రజలు ఇచ్చిన ధైర్యంతోనే సీఎం కేసీఆర్‌ను ఢీ కొట్టానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఫాంహౌస్ లో పడుకున్నోడిని ధర్నా చౌక్ వరకు గుంజుకొచ్చానని చెప్పారు. కరీంనగర్ జిల్లా రేకుర్తిలోని సాయి మహాలక్ష్మి ఫంక్షన్ హాలులో శుక్రవారం జరిగిన బీజేపీ కరీంనగర్ అసెంబ్లీ నియోకజవర్గ వెస్ట్ జోన్ నాయకులు, పోలింగ్ బూత్ అధ్యక్షులు, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో బండి సంజయ్ పాల్గొని మాట్లాడారు.
అసెంబ్లీ అభ్యర్థిగా మీ ముందుకొచ్చానని, తనను ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. తాను అసెంబ్లీకి పోటీ చేస్తున్నట్లు తెలియగానే ఇక్కడి బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతాడని కేసీఆర్‌కు అర్థమైందని, అందుకే అభ్యర్థిని మార్చేందుకు ఐదు రోజులపాటు బీఫాం కూడా ఇవ్వలేదన్నారు.
రూ. వందల కోట్లు ఖర్చు చేస్తానని చెప్పడంతో విధిలేక ఆయనకే టిక్కెట్ ఇచ్చిండన్నారు. తాను రాష్ట్రమంతా తిరిగి కొట్లాడుతుంటే కరీంనగర్లో బీఆర్ఎస్ అభ్యర్థితో రాజీ పడ్డానని తనపై కొందరు దుష్ప్రచారం చేశారని, రాజీపడడం తనకు చేతకాదన్నారు. కేసీఆర్ పైనే రాజీలేని పోరాటం చేసే తాను ఇక్కడ రాజీపడతానా అని ప్రశ్నించారు. తాను పోటీ చేస్తున్నట్లు తెలియగానే బీఆర్ఎస్ అభ్యర్థి దారుస్సలాం పోయి ఓవైసీ కాళ్లపై పడి కరీంనగర్ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండన్నారు.
ఈ సందర్భంగా టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు రొంటాల కేశవరెడ్డితోపాటు 50 మంది బీజేపీలో చేరారు. సంజయ్ వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భాగ్యనగర్ 17వ డివిజన్‌కు చెందిన వందలాది మంది యువకులు ఎంపీ ఆఫీసులో సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు.