కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు వేర్వేరుగా జరిగితే కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ తెలిపారు. మంత్రి గంగుల కమలాకర్ తో కుమ్మక్కైనట్లు జరుగుతున్న దుష్ప్రచారం.. కొందరు మూర్ఖులు కావాలని చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం కరీంనగర్ లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను కోర్టుకు హాజరయ్యే విషయంలో మూడుసార్లు వాయిదా కోరిన మాట వాస్తవమేనని, పార్లమెంట్ సమావేశాల్లో, అమెరికా టూర్ లో ఉన్నప్పుడు ఎలా హాజరవుతానని అన్నారు. కరీంనగర్ లో యువతను గంజాయితో చిత్తు చేస్తున్నా.. పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలే గంజాయిని అడ్డగోలుగా సప్లై చేస్తూ అక్రమంగా సంపాదిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు గంజాయిని అరికట్టాలని డిమాండ్ చేస్తున్నానని, లేదంటే తామే యువకులతో దళాలను ఏర్పాటు చేసి గంజాయి అమ్మేటోళ్లను పొట్టుపోట్టుగా కొట్టిస్తామని హెచ్చరించారు. మీ పిల్లలు గంజాయికి అలవాటైనా ఇట్లనే మౌనంగా ఉంటారా అని పోలీసులను ప్రశ్నించారు.
మోసం బయటపడుతుందనే కిషన్ రెడ్డి దీక్ష భగ్నం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీక్షను భగ్నం చేసి కార్యకర్తలపై పోలీసులు చేసిన దాడిని బండి సంజయ్ ఖండించారు. బీజేపీ చేస్తున్న దీక్షతో నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ చేసిన మోసాల బండారం బయటపడుతుందనే భయంతోనే దీక్ష భగ్నం చేశారని విమర్శించారు. ఉద్యోగులు రిటైర్డ్ అయితే బెన్ ఫిట్స్ ఇవ్వడానికి కూడా సొమ్ము లేకపోవడంతోనే ఉద్యోగుల పదవీ విరమణ వయసును సర్కార్ పెంచిందన్నారు. రాష్ట్రాన్ని రూ.5.5 లక్షల కోట్ల అప్పుల్లో ముంచేశారని.. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తే అప్పులెలా తీరుస్తారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
చంద్రబాబు అరెస్ట్ తో పెరిగిన టీడీపీ ఇమేజ్..
చంద్రబాబు తప్పు చేస్తే చర్యలు తీసుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదని, అయితే ఎఫ్ఐఆర్ లో పేరు లేకపోయినా సీఎంగా పనిచేసిన వ్యక్తిని అర్ధరాత్రి అరెస్ట్ చేయడం సరికాదని సంజయ్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబును ఆదరాబాదరాగా అరెస్ట్ చేయడంతో టీడీపీ ఇమేజ్ పెరిగిందని వెల్లడించారు. వాస్తవాలు మాట్లాడితే తమను చంద్రబాబు ఏజెంట్ గానో, పవన్ ఏజెంట్ గానో ప్రచారం చేయడం వైఎస్సార్సీపీ నేతలకు అలవాటైందన్నారు.
ఒవైసీ చెప్తేనే జాతీయ సమైక్యతా ఉత్సవాలు
ఒవైసీ చెబితేనే సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా కేసీఆర్ ప్రకటించారని సంజయ్ విమర్శించారు. ఒవైసీతో ప్రేమకు గుర్తుగా దారుస్సలాంలో జాతీయ సమైక్యతా ఉత్సవాలు చేసుకోవాలని సీఎంకు సూచించారు. నిజాం ఆస్తులపై కేసీఆర్ దృష్టి పడిందని, అందుకే ఆయనను గొప్పోడిగా చిత్రీకరిస్తూ తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను విస్మరిస్తున్నాడని ఆరోపించారు. కేసీఆర్ కు చేతగాకపోవడంవల్లే కేంద్రమే అధికారికంగా విమోచన దినోత్సవాలు నిర్వహిస్తోందని వెల్లడించారు.