కేసీఆర్ కుమారుడు కాకుంటే కేటీఆర్ ని ఎవరూ పట్టించుకోరని అన్నారు ఎంపీ బండి సంజయ్. కేటీఆర్ భాష, అహంకారం చూసి వాళ్ల పార్టీ వాళ్లే సిగ్గుపడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో లేదు కాబట్టే.. ఆ పార్టీ నాయకులను అరెస్ట్ చేయరని, బీజేపీ నాయకులు, కార్యకర్తలనే అరెస్ట్ చేస్తారని అన్నారు. కేసీఆర్ తో పాటు తన కూతురు, కుమారుడు, అల్లుడు.. తమ ఆస్తులు ఎన్ని ఉన్నాయో స్పష్టం చేయగలరా..? అని ప్రశ్నించారు. సిరిసిల్ల సెస్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ వాళ్లు అడ్డదారిలో గెలిచారని, నైతిక విజయం బీజేపీదే అన్నారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఓ గెలుపేనా..? అని ప్రశ్నించారు. సిరిసిల్ల పట్టణంలో నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశానికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హాజరయ్యారు.
రాష్ర్ట ప్రజలు బీజేపీ పట్ల అనుకూలంగా ఉన్నారని, బీఆర్ఎస్ పై వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు ఎంపీ బండి సంజయ్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి వెళ్తారనే భయంతోనే సీఎం కేసీఆర్ అభ్యర్థులను ముందుగానే ప్రకటించారని చెప్పారు. ఎలక్షన్స్ వచ్చే సరికి సగం మందికి కూడా కేసీఆర్ టికెట్లు ఇవ్వరని అన్నారు. గెలిచే అభ్యర్థులతో పాటు కాంగ్రెస్ పార్టీ వాళ్లకు కూడా కేసీఆరే పైసలు పంచుతారని ఆరోపించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి పని చేశాయన్నారు.
ఇక నుంచి అందరికీ అందుబాటులో ఉంటానని, కార్యకర్తల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని స్పష్టం చేశారు బండి సంజయ్. నాయకులపై ఎన్ని కేసులు ఉంటే అంత మంచిదన్నారు. తమ పార్టీ వాళ్లపై కేసులు ఉంటే ఏం ధర్నాలు చేశారని అడుగుతున్నారని, బీఆర్ఎస్ పార్టీ వాళ్లపై కేసులు ఉంటే ఏం దోచుకున్నారని ప్రజలు అడుగుతున్నారని చెప్పారు. నాయకులు, కార్యకర్తలందరూ బీజేపీ పార్టీ కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. ఎవరైనా సరే క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. వ్యక్తి కోసం కాకుండా.. పార్టీ కోసం పని చేయండి అంటూ దిశా నిర్దేశం చేశారు.
రాష్ర్టంలో బీజేపీ పార్టీనే గెలుస్తుందని ఇంటెలిజెన్స్ వర్గాల రిపోర్ట్స్ ఉన్నాయన్నారు బండి సంజయ్. అందరూ కలిసి యుద్ధం చేస్తే అధికారంలోకి వస్తామన్నారు. అధికారంలోకి రాగానే చేనేత రంగానికి సెస్ నుండి సబ్సిడీ ఇస్తామని హామీ ఇచ్చారు. చంద్రయాన్ 3 సకెస్స్ అయిన సందర్భంగా దేశప్రజలు సంతోషపడితే.. కేసీఆర్ మాత్రం చంద్రమండలంలో దందా ఎలా చేయాలని అనుకుంటున్నారని అన్నారు. మీడియా ప్రతినిధులు ధైర్యంగా ఉండాలని చెప్పారు. అధికారంలోకి రాగానే తమ ప్రభుత్వం హెల్త్ కార్డులు, ఇండ్లు ఇస్తుందన్నారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.