సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వల్లే గని ప్రమాదం

సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వల్లే గని ప్రమాదం

భూపాలపల్లి ఏరియాలోని కేటీకే ఆరవ గనిలో సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేసి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ‘రూఫ్ కూలి ఇద్దరు కార్మికులు చనిపోవడం బాధ కలిగించింది. ఆ ఇద్దరు కార్మికులు క్యాతం నర్సయ్య, సలివేణి శంకరయ్యల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. కనీస రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లనే పైకప్పు కూలినట్లు తెలుస్తోంది. అండర్ గ్రౌండ్ మైనింగ్‌లో అధికారులు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదని అర్థం అవుతుంది. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు హడావుడి చేసి, తర్వాత మరిచిపోతున్నారు. సంస్థను పూర్తి వ్యాపార దృక్పథంతో నిర్వహిస్తూ.. కార్మికుల రక్షణను, సంక్షేమాన్ని గాలికి వదిలేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇట్లాంటి ఘటనలు తరుచుగా జరుగుతున్నాయి. కార్మికుల సంఖ్యను తగ్గించి, ఉత్పత్తి పెంచి కార్మికులపై మానసికంగా, శారీరకంగా ఒత్తిడిని పెంచుతున్నారు. నష్టాలు వస్తే కంపెనీ మూసేయ్యాల్సి వస్తుందని కార్మికులను మానసిక ఆందోళనకు గురి చేస్తున్నారు. లాభాలే లక్ష్యంగా కాకుండా కార్మికుల భద్రతకు కూడా పెద్దపీట వేయాలని అధికారులను కోరుతున్నాను. ఈ ప్రమాదాలు తరుచుగా ఎందుకు జరుగుతున్నాయో పూర్తిస్థాయి విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’ అని ఆయన అన్నారు.