- సీబీఐ, ఈడీని శాసించే అధికారం బీజేపీకి లేదు: సంజయ్
- కరీంనగర్ కు వినోద్ చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలి
- దత్తత గ్రామం చినముల్కనూరుకు కేసీఆర్ ఒరగబెట్టిందేమీ లేదు
- బీఆర్ఎస్ తో పొత్తు అంటే చెంప పగలకొట్టాలని కామెంట్
- కోహెడ, చిగురుమామిడిలో మలిదశ ప్రజాహిత యాత్ర
కరీంనగర్/చిగురుమామిడి/కోహెడ, వెలుగు: లిక్కర్ స్కామ్ కేసులో ప్రాథమిక సాక్ష్యాల ఆధారంగానే ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. సీబీఐ, ఈడీని శాసించే అధికారం బీజేపీకి లేదని, అవి స్వతంత్ర దర్యాప్తు సంస్థలని ఆయన పేర్కొన్నారు. ఆధారాలుంటే ఎంత పెద్దవారైనా ఉపేక్షించకూడదన్నదే బీజేపీ విధానమన్నారు. మలిదశ ప్రజాహిత యాత్ర ప్రారంభానికి ముందు సోమవారం కరీంనగర్ లోని మహాశక్తి ఆలయం ఆవరణలో, ఆ తర్వాత హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ, చిగురుమామిడి మండల కేంద్రాల్లో సంజయ్ మాట్లాడారు.
విజయ సంకల్ప యాత్రకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందన్నారు. రాష్ట్రంలో 17 లోక్ సభ సీట్లు సాధించి క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు మళ్లీ నరేంద్ర మోదీని ప్రధాని చేయాలని డిసైడ్ అయ్యారని చెప్పారు. దేశవ్యాప్తంగా 370 సీట్లు గెలుస్తామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం నడుస్తోందని, గతంలో ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని పోటీ చేశాయన్నారు.
మరో ఐదారు రోజుల్లో తమ అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించారు. బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు అంటే చెంప పగలకొట్టాలని, చెప్పుతో కొట్టాలని తానే చెబుతున్నానని పేర్కొన్నారు. కరీంనగర్ నియోజకవర్గానికి వినోద్ కుమార్ చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని సవాల్ విసిరారు. అలాగే మాజీ సీఎం కేసీఆర్ తన దత్తత గ్రామం చిన ముల్కనూరుకు ఒరగబెట్టిందేమీ లేదని బండి విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ మూడో స్థానానికే పరిమితం అవుతుందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా లేదని, రెండు నెలల్లోనే రూ.10 వేల కోట్ల అప్పు తెచ్చారని మండిపడ్డారు.
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నయా పైసా సాయం చేయలేదంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. రాష్ట్రానికి కేంద్రం రూ.10 లక్షల కోట్లకుపైగా నిధులిచ్చిందని, రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో పాలన సాగుతోందంటే కేంద్రం ఇస్తున్న నిధుల వల్లే అని వ్యాఖ్యానించారు. దమ్ముంటే ఆ నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. డేట్, టైం చెప్తే తమ పార్టీ తరఫున కిషన్ రెడ్డిని పంపిస్తామన్నారు.