బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్ విమర్శ
ఇలాంటి పచ్చి అబద్ధాల సీఎం దేశంలోనే లేడు
సన్నొడ్ల రైతులకు బోనస్ ఏదీ?
రైతుల సమస్యలపై 14న ఆందోళనలు చేస్తమని వెల్లడి
వేములవాడ, వెలుగు: సీఎం కేసీఆర్ కోతల రాయుడని, కోతలు కోయడానికే ఢిల్లీకి పోయాడని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఇలాంటి పచ్చి అబద్ధాలు మాట్లాడే సీఎం దేశంలోనే లేడన్నారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆయన పర్యటించారు. వేములవాడ అర్బన్ మండలం ఆరెపల్లి, సంకెపల్లి గ్రామాల్లో ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్స్‌ను ప్రారంభించారు. అనంతరం పలు పెండ్లీలకు హాజరయ్యారు. వేములవాడలో యువకులు బండి సంజయ్ సమక్షంలో పార్టీలో చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనం టీఆర్ఎస్ను చావుదెబ్బ కొట్టారన్నారు. అయినా బుద్ధితెచ్చుకోకుండా కోతలు కోస్తున్నాడన్నారు. అనుకూల మీడియాలో బ్రేకింగ్ న్యూస్ వేయించుకోవడం తప్ప ఢిల్లీలో సీఎం చేసేదేమీ లేదన్నారు. తాను లేనిదే తెలంగాణ లేదని సీఎం చెప్పుకుంటున్నాడని, ఈ నియంతృత్వ ధోరణి వల్లే చాలా మంది ప్రాణాలు పోయాయన్నారు. కేసీఆర్ ఫ్యామిలీ దోపిడీ వల్లే రాష్ట్రం అప్పులపాలైందన్నారు.
దమ్ముంటే మిడ్‌మానేరు ముంపు గ్రామాల్లో పర్యటించు
రైతులకు మేలు చేసే చట్టాలను కేసీఆర్ వ్యతిరేకించడం విచిత్రంగా ఉందని సంజయ్ అన్నారు. రైతుల్ని సన్నొడ్లు వేయండని చెప్పి, ఆయన మాత్రం ఫామ్‌హౌస్‌లో దొడ్డు బియ్యం పండించారన్నారు. సన్నొడ్ల రైతులకు బోనస్ ఇస్తనని మోసం చేస్తున్నాడన్నారు. పది వేల వరద సాయం రాష్ట్రం మొత్తం ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో రైతుల సమస్యలపై 14న ఆందోళనలు చేపడుతామన్నారు. మిడ్‌మానేరు నిర్వాసితులకు కేసీఆర్ అన్యాయం చేశారన్నారు. సీఎంకు దమ్ముంటే మిడ్ మానేరు ముంపు గ్రామాల్లో పర్యటించాలని సవాల్ చేశారు. వేములవాడ ఎమ్మెల్యే 8 నెలలుగా పత్తాలేడని, నియోజకవర్గం అనాథగా మారిందని అన్నారు.
వేములవాడకు ఏం చేసిండు?
వేములవాడ గుడి డెవలప్ మెంట్ కోసం సీఎం గతంలో ఎన్నో హామీలిచ్చి ఏ ఒక్కటీ చేయలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిస్తే కేంద్రంతో మాట్లాడి నిధులు ఇప్పిస్తామన్నారు. ఈ సందర్భంగా బాలరాజుపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, ఎంపీపీ బండ మల్లేశం, నాయకులు రేగుల మల్లికార్జున్, కుమ్మరి శంకర్, గోపు బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
For More News..