రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను డైవర్ట్ చేసేందుకే టీఆర్ఎస్ నాయకులు నిరసనలు చేస్తున్నారని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ నిరసనలు, కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఆయన ఢిల్లీలో మాట్లాడారు. ‘రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక జోకర్ అయ్యారు. కాంగ్రెస్ చేసిన అనర్థాలను మోడీ వివరించే ప్రయత్నం చేశారు. రాజ్యాంగాన్ని అవమానించేలా కేసీఆర్ మాట్లాడారు. అయినా కాంగ్రెస్ ను అంటే టీఆర్ఎస్ కు వచ్చిన ఇబ్బందేంటి. రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన విమర్శలను డైవర్ట్ చేసేందుకు టీఆర్ఎస్ నిరసనలకు దిగింది. తెలంగాణ ఏర్పాటు అసలు కేసీఆర్ కు ఇష్టంలేదు. కేసీఆర్ కేబినెట్ లో ఎంతమంది ఉద్యమకారులున్నారు. తెలంగాణ ద్రోహులను చూసి అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి. శ్రీకాంతాచారి ఆత్మ క్షోభిస్తుంది. రాజ్యాంగాన్ని కేసీఆర్ అవమానించారు. అసలు రాజ్యాంగాన్ని ఎందుకు మార్చుకోవాలో ఆయన చెప్పాలి. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పేంతవరకు మాపోరాటం కొనసాగుతుంది. ఆరే దీపానికి వెలుగు అన్నట్లుగా టీఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎక్కడ తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయాలపై కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని విషయాలపై ప్రధాని స్పందించారు. కాకినాడ తీర్మానంలో బీజేపీ తెలంగాణ ఇస్తామని చెప్పింది కానీ తర్వాత మెజార్టీ లేకపోవడం వల్ల రాష్ట్రం ఇవ్వలేకపోయారు. బీజేపీ ప్రభుత్వం కూడా మూడు రాష్ట్రాలు విభజించింది. బీజేపి నేత సుష్మా స్వరాజ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పూర్తిగా మద్దతు ఇచ్చింది. పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర బిల్లు సందర్భంగా చర్చలో , ఓటింగ్‌లో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇష్టం లేదు. దొంగ దీక్ష చేసింది నువ్వు కదా...? ఎందుకు మధ్యలోనే దీక్ష ఆపేశావ్? లోక్ సభలో బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారు. నీ కుటుంబం కోసం, తెలంగాణ ద్రోహుల కోసం రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నామా? రాష్ట్రంలో అన్ని వర్గాలవారు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే ఎందుకు స్పందించలేదు? ధనిక రాష్ట్రమైన తెలంగాణాను అప్పుల రాష్ట్రంగా మార్చావు. తెలంగాణ రాష్ట్రం కోసం నవ్వుకానీ, నీ కుటుంబం కానీ ఏంచేసిందో చెప్పాలి. రైతుల ఆత్మహత్యలకు ,నిరుద్యోగుల ఆత్మహత్యలకు, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు, ఉపాధ్యాయుల ఆత్మహత్యలకు కారణం నువ్వు. భూములను దోచుకోవడం కోసమే ధరణి తీసుకొచ్చావా? సెంటిమెంట్‌తో మరోసారి రాజకీయ లబ్ధి పొందాలని కేసీఆర్ చూస్తున్నాడు’ అని బండి సంజయ్ అన్నారు.
For More News..