ఆర్వోబీల నిర్మాణం జాప్యం.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కేంద్రం అసంతృప్తి

తీగలగుట్ట సమీపంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపట్ల కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. నిధులు మంజూరై ఆరు నెలలు దాటినా పనుల్లో పురోగతి లేకపోవడంపట్ల అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు జాతీయ రహదారులు, రవాణా శాఖ రీజనల్ అధికారి ఎస్.కె.కుశ్వహా  రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. 

కేంద్రానికి బండి సంజయ్ లేఖ

కరీంనగర్ లోని తీగలగుట్టపల్లి ఆర్వోబీసహా రాష్ట్రవ్యాప్తంగా 5 ఆర్వోబీల నిర్మాణానికి కేంద్రం అంగీకారం తెలుపుతూ 2022  నవంబర్ లో  432 కోట్ల 84 లక్షల రూపాయలను  మంజూరు చేసింది. నిధులు మంజూరై 6 నెలలు దాటినా ఇంతవరకు నిర్మాణ పనుల్లో పురోగతి లేకపోవడంపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈనెల 11న కేంద్రానికి లేఖ రాశారు. 

గడువులోగా పూర్తి చేయాలి

 కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని తీగలగుట్ట సమీపంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ ఓబీ) నిర్మాణంలో జరుగుతున్న జాప్యంవల్ల స్థానిక ప్రజల రాకపోకలకు తీవ్రమైన ఇబ్బంది ఏర్పడిందన్నారు. తొందరగా పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని పలుమార్లు అధికారులను కోరుతున్నప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన గడువు ప్రకారం ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. బండి సంజయ్ రాసిన లేఖ ఆధారంగా కేంద్ర రీజనల్ అధికారి కుశ్వహ.. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. కరీంనగర్ లోని తీగలగుట్టపల్లితోపాటు హన్మకొండ, వరంగల్, నిజామాబాద్, వికారాబాద్ లలో మంజూరైన ఆర్వోబీల నిర్మాణంలోనూ పురోగతి లేని విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇచ్చిన గడువు ప్రకారం వెంటనే ఆర్వోబీ నిర్మాణాలను పూర్తి చేయాలని కోరారు.  వాస్తవానికి కరీంనగర్ లోని తీగలగుట్టపల్లి రైల్వే లైన్ క్రాసింగ్ విషయంలో స్థానిక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఆర్వోబీ నిర్మాణం కోసం బండి సంజయ్ కుమార్ ఎంపీ అయినప్పటి నుండి తీవ్రంగా యత్నిస్తున్నారు. అందుకోసం రైల్వే శాఖ మంత్రితోపాటు, రైల్వే బోర్డు ఛైర్మన్, దక్షిణ మధ్య రైల్వే శాఖ జనరల్ మేనేజర్ సహా ఉన్నతాధికారులందరినీ కలిసి ఈ మేరకు ప్రతిపాదనలు సమర్పించారు. ఆర్వోబీ లేకపోవడంవల్ల జరుగుతున్న ఇబ్బందులను వివరించారు. 

రాష్ట్ర ప్రభుత్వం వల్లే ఆలస్యం

 కేసీఆర్ ​ ప్రభుత్వం వల్లనే ఆర్వోబీ ఆలస్యం అవుతున్నదని.. రైల్వే శాఖతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలుచేయకపోవడమే అసలు కారణమని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం 80% రైల్వే శాఖ 20% ఖర్చు భరించేందుకు ఎంవోయూ కుదుర్చుకుని.. ఇప్పుడు మొత్తం వ్యయం రైల్వేశాఖనే భరించాలని యూ టర్న్​ తీసుకోవడమే అసలు కారణమని బీజేపీ చెప్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రైల్వేశాఖ అధికారులే ధ్రువీకరించారని స్పష్టం చేస్తున్నారు.

పట్టాలెక్కని ఆర్వోబీ పనులు

బండి సంజయ్ ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించిన రైల్వే శాఖ ఆర్వోబీ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది. అందులో భాగంగా రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఒప్పందం కుదిరింది.రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో తీగల గుట్టపల్లి ఆర్వోబీ పనులు పట్టాలెక్కడం లేదు. కరీంనగర్​ జిల్లా కేంద్రంలో రైల్వేఓవర్​ బ్రిడ్జి నిర్మాణం పనుల జాప్యానికి రైల్వే శాఖదే కారణమని టీఆర్‌ఎస్​నేతలు ఆందోళనలకు సిద్ధమవుతున్న వేళ బీజేపీ నేతలు షాకింగ్​విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. అసలు టీఆర్‌ఎస్​ ప్రభుత్వం వల్లనే ఆర్వోబీ ఆలస్యం అవుతున్నదని.. రైల్వే శాఖతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలుచేయకపోవడమే అసలు కారణమని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం 80% రైల్వే శాఖ 20% ఖర్చు భరించేందుకు ఎంవోయూ కుదుర్చుకుని..  ఆ మేరకు  2020 సెప్టెంబర్ 15న కన్సెంట్ లెటర్ కూడా ఇచ్చింది.  ఇప్పుడు మొత్తం వ్యయం రైల్వేశాఖనే భరించాలని యూ టర్న్​ తీసుకోవడమే అసలు కారణమని బీజేపీ చెప్తున్నారు. 

కేసీఆర్ ప్రభుత్వం యూటర్న్

ఆర్వోబీ ఏర్పాటుకు ఎంత వ్యయం అవుతుందనే దానిపై అధ్యయనం చేసిన అధికారులు దాదాపు రూ.100 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేశారు. అందులో భాగాం 80 (రూ.79.84 కోట్లు) శాతం వాటా చెల్లించాలంటూ లేఖ రాసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అనూహ్యంగా యూ టర్న్ తీసుకుంది. ఈ మొత్తాన్ని తాము చెల్లించలేమని, ఆర్వోబీ నిర్మాణాల విషయంలో కేంద్రం కొత్తగా తీసుకున్న విధాన నిర్ణయాన్నే అమలు చేయాలని కోరుతూ మెలిక పెట్టింది. 

కేంద్రం నిధులు మంజూరు

కేంద్ర మంత్రిసహా ఉన్నతాధికారులను కలిసి బండి సంజయ్ చేసిన విజ్ఞప్తులను పరిశీలించిన కేంద్రం సేతు భారతం కార్యక్రమంలో భాగంగా 100 శాతం నిధులతో రాష్ట్రంలోని 5 ఆర్వోబీలను నిర్మాణానికి ఆమోదం తెలిపి గత నవంబర్లోనే నిధులు మంజూరు చేసింది. అయినప్పటికీ నేటికీ ఆ నిర్మాణాలను పూర్తి చేయకపోవడంతో బండి సంజయ్ ఈ విషయాన్ని కేంద్రం ద్రుష్టికి తీసుకెళ్లడంతో నిర్ణీత గడువులోగా ఆర్వోబీల నిర్మాణాన్ని పూర్తి చేయాలంటూ రాష్ట్రానికి కేంద్రం లేఖ రాసింది.

కొత్త విధానంతో మెలిక

రాష్ట్ర రహదారులపై కొత్తగా నిర్మించబోయే ఆర్వోబీలు, ఆర్‌యూబీలకు సెంట్రల్ రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి కేటాయించేలా జాతీయ రహదారుల శాఖ కొత్త విధానాన్ని రూపొందించింది. దీనికి సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం 2022 జూన్ 29న జాతీయ రహదారుల అథారిటీ, రైల్వే మంత్రిత్వశాఖలతో రాష్ట్ర ప్రభుత్వం త్రైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. జాతీయ రహదారుల అథారిటీ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ రోడ్లపై 57 ఆర్వోబీ, ఆర్‌యూబీల నిర్మాణానికి ఈ ఒప్పందంలో అవగాహన కుదిరింది. అయితే తీగలగుట్టపల్లిలో ఆర్వోబీ నిర్మాణానికి దానికంటే ముందే కుదుర్చుకున్న ఒప్పందానికి జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ రూపొందించిన కొత్త నిబంధనతో మెలిక పెట్టడంతో దాని నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది.