రాముని విగ్రహ ప్రతిష్ట కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది : బండి సంజయ్

  •     ఎంపీ బండి సంజయ్

కొడిమ్యాల, వెలుగు : ఈనెల 22న అయోధ్యలో ప్రారంభించనున్న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోందని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం డబ్బు తిమ్మాయపల్లి గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, చత్రపతి శివాజీ, బతుకమ్మ తల్లి విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ అయోధ్య రామాలయ నిర్మాణం ఏ ఒక్క పార్టీకి సంబంధించిన అంశం కాదని

ప్రపంచంలోని ప్రతి హిందువుకు సంబంధించిన అతి ముఖ్య ఘట్టమని అన్నారు. అయోధ్య అక్షింతలపై వివాదం చేయడం ప్రతిపక్షాలకు తగదన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రాధ, ఎంపీటీసీ జగన్మోహన్ రెడ్డి, లీడర్లు శ్రవణ్ కుమార్, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. కార్యకర్తల కోరిక మేరకు బండి సంజయ్ గోడ మీద కమలం పువ్వు బొమ్మ గీసి ప్రధాని నరేంద్ర మోదీ పేరు రాశారు. 

కొండగట్టుకు శ్రీరాముని పాదుకలు

అయోధ్య నుంచి శ్రీరాముని పాదుకలు బుధవారం రాత్రి కొండగట్టుకు చేరుకున్నాయి. 14 రోజులుగా 1000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి కొండగట్టుకు చేరుకున్న భక్తులను ఎంపీ బండి సంజయ్ కలిశారు. కొద్ది దూరం పాదుకలను తలపై పెట్టుకుని పాదయాత్ర చేశారు. అయోధ్యలో రాముని విగ్రహం ప్రతిష్టించే 22నే పాదుకలను కూడా ప్రతిష్టిస్తామని సురేశ్​ ఆత్మరామ్ మహారాజ్ తెలిపారు. కాగా పాదయాత్ర బృందంలో పూడూరు గ్రామానికి చెందిన యూసఫ్ అనే ముస్లిమ్ వ్యక్తి కూడా పాదుకలను మోశాడు.