ఫిబ్రవరి 10 నుంచి బండి సంజయ్‌ విజయ సంకల్ప యాత్ర

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ మరో పాదయాత్రకు సిద్దమయ్యారు.  2024 ఫిబ్రవరి 10వ తేదీ నుంచి విజయ సంకల్ప యాత్రను చేపట్టనున్నారు. కరీంనగర్‌ ఎంపీ నియోజకవర్గం పరిధిలో ఈ యాత్ర కొనసాగనుంది.  లోక్‌సభ ఎన్నికలు జరిగే వరకు ఈ  యాత్ర చేయాలని బండి సంజయ్ నిర్ణయం తీసుకున్నారు.  కొండగట్టు ఆంజన్న ఆలయంలో పూజలు  చేసి మేడిపల్లి నుంచి యాత్ర ప్రారంభించనున్నారు.  రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో యాత్రను ముగించనున్నారు.  తొలిదశలో మొత్తం 119 కి.మీల మేరకు యాత్రను ప్లాన్ చేశారు.  

కేంద్ర అభివృద్ధి పథకాలను జనంలోకి తీసుకెళ్లడమే ధ్యేయంగా ఈ యాత్రను చేపట్టనున్నారు బండి సంజయ్.  కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మండలాలను, వీలైనన్ని ఎక్కువ గ్రామాల్లో పాదయాత్ర చేసేలా రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకున్నారు.  ప్రజా సంగ్రామ యాత్రతో తెలంగాణలో బీజేపీ ముఖచిత్రం మారిపోయిందని..  విజయ సంకల్ప యాత్రతో బీజేపీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవించబోతుందని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.   పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 17 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు.