వేద మంత్రాలతో వధు, వరులను ఒక్కటి చేసిన పురోహితుడే…నవ వధువుతో పారిపోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని విధిష జిల్లా సిరోంజ్లోని బాగ్ రడ్లో జరిగింది. యువతి భర్త ఫిర్యాదుతో ఈ విషయం ఆలస్యంగా తెలిసింది. దీంతో స్థానికులు షాక్ కు గురయ్యారు.
వినోద్ మహరాజ్ అనే పురోహితుడు ఈ నెల 7న… బాగ్ రడ్ కు చెందిన యువతికి పెళ్లి జరిపించాడు. వివాహ కార్యక్రమాలు పూర్తి కాగానే వధువు సంప్రదాయం ప్రకారం అత్తింటి నుంచి తల్లిగారింటికి వచ్చింది. రోజులు గడుస్తున్నా మళ్లీ అత్తింటికి వెళ్లలేదు వధువు. కొన్ని వ్యక్తిగత కారణాలు చెప్పడంతో.. అత్తింటివారు అభ్యంతరం చెప్పలేదు. ఈ నెల 23న వధువు ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. ఆమె కోసం తల్లిదండ్రులు వెతికారు. తర్వాత ఏం జరిగిందని ఆరా తీస్తే.. ఆమె పెళ్లి చేసిన పురోహితుడు వినోద్ మహరాజ్తో పరారైనట్లు తెలిసింది.
ఇంట్లో నుంచి పారిపోతూ ఆ నవవధువు 1.5 లక్షల రూపాయల విలువ చేసే బంగారు నగలు, 30 వేల రూపాయల నగదు తీసుకెళ్లింది. వెంటనే వధువు, పురోహితుడి కోసం గాలింపు మొదలుపెట్టారు. వినోద్ శర్మకు పెళ్లై.. ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొద్ది రోజుల క్రితం అతడికి యువతితో పరిచయం ఏర్పడిందట. అంతే కాదు వినోద్ మహరాజ్ మే 23న అదే ఊరిలో మరో పెళ్లి జరిపించాల్సి ఉంది.