ఎంపీ ఎన్నికల్లోనూ అసెంబ్లీ ఫలితాలే.. : కడియం కావ్య

  •     ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి

వరంగల్‍, వెలుగు: రాష్ట్రంలో జరుగుతున్న లోక్‍సభ ఎన్నికల్లోనూ కర్నాటక, తెలంగాణ ఫలితాలే రిపీట్‍అవుతాయని కాంగ్రెస్‍ వరంగల్‍ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య అన్నారు. శనివారం వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి అధ్యక్షతన హనుమకొండ కాంగ్రెస్‍ భవన్​లో నిర్వహించిన ప్రెస్‍మీట్లో ఆమె మాట్లాడుతూ మీ ఆడబిడ్డగా భావించి, తనకు ఓటు వేయాలని కోరారు. ఎమ్మెల్యే రాజేందర్‍రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‍ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే అనేక హామీలు అమలు చేశామన్నారు.  

మోదీ పాలనలో రాజ్యాంగం ప్రమాదంలో ఉంది

పర్వతగిరి/ వర్ధన్నపేట, వెలుగు: మోదీ పాలనలో రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, దేశంలో బీజేపీ అధికారంలో ఉంటే నష్టపోతామని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య అన్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరిలో శనివారం అల్లూరి సీతారామరాజు విగ్రహం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి, కార్నర్ మీటింగ్​లో మాట్లాడారు.

మోదీ ప్రభుత్వం అన్నింటినీ  ప్రైవేటీకరణ చేయడానికి కంకణం కట్టుకుందన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్​కు ఓటు వేయాలని కోరారు. అనంతరం వారి సమక్షంలో అన్నారం మాజీ సర్పంచి మునుకుంట్ల యశోద, బాబు మరో 10మంది కాంగ్రెస్​లో చేరారు. కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బొంపెల్లి దేవేందర్​రావు, జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్​రావు తదితరులు పాల్గొన్నారు.

వర్ధన్నపేటలో మండలాధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన కార్నర్​మీటింగ్​లో ఎమ్మెల్యే కేఆర్​నాగరాజు మాట్లాడుతూ మన ఇంటి ఆడబిడ్డ, ఉన్నత విద్యావంతురాలై కడియం కావ్యకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ మారినేని రవీందర్ రావు, వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ అంగోతు అరుణ, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.