- లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం
- బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి
నిర్మల్, వెలుగు : రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెడం నగేశ్ రెండు లక్షలపైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందుతారని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన నిర్మల్‌లోని తన క్యాంప్ ఆఫీసులో ఎంపీ అభ్యర్థి నగేశ్‌ను మీడియాకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలే తమ అభ్యర్థిని గెలిపిస్తాయన్నారు. బీఆర్ఎస్ నాయకులంతా తమ భూకబ్జాలను కప్పిపుచ్చుకొని, అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకే కాంగ్రెస్‌లో చేరుతున్నారని ఆరోపించారు.
మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకు కాంగ్రెస్‌లో చేరాలని ఆరాటపడుతున్నారని, కానీ ఆయనకు ఆ పార్టీలో చేరేందుకు అవకాశం దక్కడంలేదన్నారు. రాజకీయంగా రిటైర్మెంట్ అయ్యే సమయంలో పార్టీలు మారుతూ తన నిజ స్వరూపాన్ని బయటపెడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న డీమార్ట్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాను ఇప్పటికే కలెక్టర్‌కు, రెండ్రోజుల క్రితం రెవెన్యూ మంత్రికి సైతం తాను ఫిర్యాదు చేశానన్నారు.
గాజులపేట ప్రాంతంలోని శ్రీకృష్ణ మందిరానికి సంబంధించిన భూముల కబ్జాలపై కూడా విచారణ జరిపి చర్యలు చేపట్టాలని కోరారు. పార్లమెంట్ఎన్నికల్లో నగేశ్‌ను గెలిపించాలని కోరారు. సమావేశంలో బిజేపీ జిల్లా అధ్యక్షుడు అంజు కుమార్ రెడ్డి, లోక్ సభ కన్వీనర్ అయ్యన్న గారి భూమయ్య,పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి రావుల రామనాథ్, పార్టీ టౌన్ ప్రెసిడెంట్ సాధం అరవింద్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అర్జున్ తదితరులు పాల్గొన్నారు.