- ఎన్డీయే కూటమిలో భాగంగా తమకే సపోర్టంటున్న బీజేపీ
- పాత పరిచయాలతో మద్దతు కోరుతున్న బీఆర్ఎస్ అభ్యర్థి
- తెలుగు తమ్ముళ్ల ఓట్లపై కాంగ్రెస్ లోనూ ఆశలు
- ఇవాళ నిర్ణయాన్ని ప్రకటించనున్న టీడీపీ లీడర్లు
ఖమ్మం, వెలుగు: ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం చుట్టూ ఎంపీ అభ్యర్థులు చక్కర్లు కొడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో తెలుగు తమ్ముళ్ల ఓట్లను దక్కించుకునేందుకు ప్లాన్లు వేస్తున్నారు. ఎవరికి వారు టీడీపీ మద్దతు తమకే ఉందని చెప్పుకుంటున్నారు. ఎన్డీయేలో టీడీపీ భాగస్వామి అయిన కారణంగా తమకే ఆ పార్టీ సపోర్టు ఇవ్వాలని బీజేపీ కోరుతుండగా, తాను టీడీపీలో ఉన్నప్పుడు చేపట్టిన కార్యక్రమాలను గుర్తు చేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు మద్దతు ఆశిస్తున్నారు. ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు అంతర్గతంగా టీడీపీ సపోర్ట్ చేసింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే కొనసాగించాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. అయితే తెలుగుదేశం పార్టీ లీడర్లు మాత్రం ఇంకా సైలెంట్ గానే ఉన్నారు. పార్టీ అధినేత నుంచి స్పష్టత తీసుకున్నామని, నేడు నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెబుతున్నారు.
ముఖ్యనేతలు పార్టీ వీడినా..
ఆంధ్రప్రదేశ్సరిహద్దులను ఆనుకొని ఉండడంతో తెలుగుదేశానికి ఇప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో క్యాడర్ ఉంది. ఆ పార్టీని కమ్మ కమ్యూనిటీ ఓన్ చేసుకోవడంతో సహజంగానే ఇక్కడి పాలిటిక్స్ లో టీడీపీ ప్రభావం కనిపిస్తుంది. 2018 ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా సత్తుపల్లి, అశ్వారావుపేటలో టీడీపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఆ తర్వాత వాళ్లిద్దరూ బీఆర్ఎస్ లో చేరారు. తుమ్మల నాగేశ్వరరావు, నామా నాగేశ్వరరావు వంటి ముఖ్యనేతలు పార్టీని వీడినా క్యాడర్ పార్టీని కాపాడుకుంటూ వస్తోంది. ఇక స్థానిక ఈక్వేషన్లలో భాగంగా మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లలో కాంగ్రెస్ కు టీడీపీ క్యాడర్ సపోర్ట్ చేసింది. చంద్రబాబు అరెస్ట్ సమయంలో కేటీఆర్ చేసిన కామెంట్లతో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా టీడీపీ లీడర్లు నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత దాన్ని కవర్ చేసుకునేందుకు స్థానిక బీఆర్ఎస్ లీడర్లు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.
నామాను అడ్డుకున్న టీడీపీ క్యాడర్
నామా నాగేశ్వరరావు గతంలో తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించారు. 2009లో మొదటిసారి ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. పార్టీ అధినేత చంద్రబాబుకు సన్నిహితంగా ఉండేవారు. ఆ తర్వాత పరిణామాల్లో 2019 ఎన్నికలకు ముందు బీఆర్ఎస్లో చేరి, రెండో సారి ఎంపీగా ఎన్నికయ్యారు. దీంతో ఇప్పటికీ చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం, స్థానిక లీడర్లతో ఉన్న పాత పరిచయాలతో తనకు మద్దతివ్వాలని నామా కోరుతున్నారు. అంతకు ముందు వ్యక్తిగతంగా టీడీపీ లీడర్ల ఇండ్లకు వెళ్లి మద్దతు కోరిన ఆయన, నాలుగు రోజుల క్రితం జిల్లా టీడీపీ ఆఫీస్ కు వెళ్లారు. ఆ సమయంలో చంద్రబాబుపై కేసీఆర్, కేటీఆర్ చేసిన కామెంట్లకు సారీ చెప్పించాలంటూ కొందరు టీడీపీ కార్యకర్తలు నామాను నాగేశ్వరరావును అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెంటనే ముఖ్యనేతలు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. పార్టీ మద్దతుపై త్వరలోనే నిర్ణయం చెబుతామని ఈసందర్భంగా టీడీపీ నేతలు ఆయనకు వివరించారు.
మద్దతు తమకేనంటున్న బీజేపీ
గతంలో ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ, కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్లీ జట్టు కట్టింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఎన్నికల బరిలో నిలిచాయి. దీంతో టీడీపీ సపోర్ట్ తమకే ఉంటుందని బీజేపీ ఆశిస్తోంది. ప్రస్తుతం బీజేపీ తరఫున ఖమ్మం అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాండ్ర వినోద్ రావు రెండు సార్లు ఖమ్మం జిల్లా టీడీపీ ఆఫీస్ కు వెళ్లారు. కూటమి ధర్మాన్ని గుర్తు చేస్తూ, తనకు మద్దతివ్వాలని కోరారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలంటూ టీడీపీ చేస్తున్న పోస్టుకార్డు ఉద్యమానికి మద్దతు తెలిపారు.
ఇలా మూడు పార్టీల అభ్యర్థులు టీడీపీ ఓటర్లపై కన్నేయగా, ఎవరికి మద్దతిస్తారనేది మాత్రం ఇంకా ఆ పార్టీ లీడర్లు స్పష్టంగా ప్రకటించలేదు. అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితులకు, ఇప్పటికి తేడా ఉందని మాత్రం చెబుతున్నారు. అయితే ఎన్డీయేలో భాగస్వామిగా టీడీపీ ఉండడంతో బీజేపీకే మద్దతు ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అదే విషయాన్ని ఇవాళ ప్రకటించనున్నట్టు టీడీపీ ముఖ్యనేతలు
చెబుతున్నారు.
తమ్ముళ్ల ఓట్లపై కాంగ్రెస్ లోనూ ఆశలు
మరోవైపు కాంగ్రెస్ కూడా టీడీపీ ఓటింగ్ తమకు అనుకూలంగా ఉంటుందని ఆశిస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విడివిడిగా టీడీపీ జిల్లా ఆఫీస్ కు వెళ్లి తమ విజయానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. రీసెంట్ గా కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి కూడా మంత్రి పొంగులేటితో కలిసి మరోసారి టీడీపీ ఆఫీస్ కు వెళ్లారు. అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలని రిక్వెస్ట్ చేశారు. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని చేపట్టిన పోస్ట్ కార్డు ఉద్యమానికి మద్దతు తెలిపారు.