
- ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యల వెనుక మర్మం అదే: ఎంపీ చామల
న్యూఢిల్లీ, వెలుగు: పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేటీఆర్ దోచుకొని, బినామీల దగ్గర దాచుకున్న సొమ్ముతో ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యల వెనుక మర్మం అదేనని ఆయన చెప్పారు. అందుకే కేటీఆర్ తన ప్రెస్ మీట్ లో కొత్త ప్రభాకర్ రెడ్డి మాటలను సమర్థించారని చెప్పారు.
ఆ కామెంట్స్ నుంచి తప్పించుకునేందుకు ప్రజలే ప్రభుత్వాన్ని కూల్చాలని కోరుకుంటున్నారని కేటీఆర్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఎంపీ చామల మీడియాతో మాట్లాడారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఏఐ, గ్రాఫిక్స్ వీడియోలు, ఫొటోలతో తెలంగాణ ప్రజల్ని బీఆర్ఎస్ మాయలోకి దింపిందన్నారు. విష ప్రచారాలు, ద్వేషాన్ని పెంచుతూ తప్పుడు ప్రచారం చేసిందని మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేయడంలో కేటీఆర్ ను మించినవారు లేరని దుయ్యబట్టారు.
కిషన్రెడ్డి తప్పును ఒప్పుకున్నట్టే..
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో షేర్ చేసిన ఫొటోను డిలీట్ చేసిన కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తన తప్పును అంగీకరించారని చెప్పారు. ఫేక్ ఫొటో కాకపోతే ఎందుకు డిలీట్ చేశారో కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. ఫేక్ వీడి యోలు పెట్టి డిలీట్ చేసిన విషయాన్ని కిషన్ రెడ్డి.. మోదీకి చెప్పకపోవడంతోనే ప్రధాని అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు.
అలాగే, ఐఏఎస్ స్మితా సబర్వాల్ సైతం ఫేక్ ఫొటో ట్వీట్ చేయడాన్ని తప్పుబట్టారు. బాధ్యత గత హోదాలో ఉన్న రాజకీ య నాయకులు, ఉన్నతాధికారులు తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేసే ముందు ఒకసారి ఆలోచించుకోవాలన్నారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిన వారిపై న్యాయపరంగా ముందుకెళ్తామన్నారు.