రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్​దే​ : ఎంపీ చామల, ఎమ్మెల్యే మందుల

రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్​దే​ :  ఎంపీ చామల, ఎమ్మెల్యే మందుల
  • ఎంపీ చామల, ఎమ్మెల్యే మందుల 

శాలిగౌరారం (నకిరేకల్), వెలుగు : నాడు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేస్తే.. నేడు సీఎం రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. శుక్రవారం శాలిగౌరారం మండలం మాదారం నుంచి ఇటుకులపహాడ్ వరకు, వల్లాల నుంచి జోలంవారిగూడెం వరకు రోడ్డు నిర్మాణ పనులకు వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలను పట్టించుకోకపోవడంతో ఇటుకులపహాడ్ రోడ్డు అధ్వానంగా మారిందన్నారు.

 గతంలో ఈ రోడ్డుపై నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశామని గుర్తుచేశారు. 3 నెలల్లో ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ ఇటుకులపహాడ్ రోడ్డు నిర్మించాలని గతంలో ధర్నా చేస్తే తనపై కేసు పెట్టారని చెప్పారు. రోడ్లకు మరమ్మతులు చేయకపోవడం వల్ల అస్తవ్యస్తంగా మారాయని తెలిపారు. కమీషన్లతో కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్మును కేసీఆర్ కుటుంబ సభ్యులు దండుకున్నారని మండిపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నూక కిరణ్ కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాదూరి శంకర్ రెడ్డి, మండల అధ్యక్షుడు కందాల సమరంరెడ్డి, మాజీ సర్పంచులు షేక్ ఇంతియాజ్ అహ్మద్, అల్లి సైదులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.