తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలున్నా..రాష్ట్రానికి తెచ్చిందేమీ లేదు : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలున్నా..రాష్ట్రానికి తెచ్చిందేమీ లేదు : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
  • ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్​ కుమార్​రెడ్డి 

యాదాద్రి, వెలుగు: తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా కేంద్ర బడ్జెట్​లో రాష్ర్టానికి తెచ్చింది ఏమీ లేదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వివర్శించారు. నిధులు మంజూరు చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి వారు పట్టించుకోలేదన్నారు.

ఆదివారం భువనగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఢిల్లీ, బిహార్ ఎన్నికల బడ్జెట్ లా ఉందని ఎద్దేవా చేశారు. లక్షా అరవై మూడు వేల కోట్లు తెలంగాణ అభివృద్ధి కోసం నిధులు అడిగినా బడ్జెట్​లో కేటాయించలేదన్నారు.

మూసీ ప్రక్షాళన కోసం కేంద్ర బడ్జెట్​లో నిధులు కేటాయించాలని కోరినా పట్టించుకోలేదని మండిపడ్డారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందని చెప్పడం సిగ్గుచేటన్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ గురించి నిర్మలాసీతారామన్ ఒక్క నిమిషం కూడా మాట్లాడలేదని తెలిపారు.  సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో అనేకసార్లు నిధుల కోసం ప్రయత్నం చేసినా మొండిచేయి చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కేంద్ర బడ్జెట్​ను గాడిద గుడ్డుతో పోలుస్తూ పోస్టర్​ విడుదల చేశారు.