- మేడ్చల్ కలెక్టర్‌కు ఎంపీ చామల లేఖ
- రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్యపై
- రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైర్
హైదరాబాద్, వెలుగు: మేడ్చల్‌లో రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య విషయంలో నిజానిజాలు దాచి పెట్టి తమ ప్రభుత్వంపై హరీశ్ రావు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. హరీశ్ రావు మాట్లాడిన తీరు రైతులను రెచ్చగొట్టే విధంగా ఉందన్నారు.
ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీపై తప్పుడు ప్రచారం చేస్తూ రైతులను ఆయన ఆందోళనకు గురిచేస్తున్నారన్నారు. సురేందర్ రెడ్డి తల్లికి రూ.1.50 లక్షల రుణమాఫీ జరిగిందని తెలిపారు. రుణమాఫీ కానివారి వివరాలను సేకరించి వారికి రుణమాఫీ జరిగేలా చూస్తున్నామని చెప్పారు.
కానీ, రుణమాఫీ జరగదు అనేలా హరీశ్ మాట్లాడిన తీరు రైతుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసి వారిని ఆత్మహత్యకు పురిగోల్పేలా ఉందని ఎంపీ మండిపడ్డారు. హరీశ్‌పై కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మేడ్చల్ కలెక్టర్‌కు ఎంపీ చామల ఆదివారం లేఖ రాశారు. గత ప్రభుత్వ హయాంలో రూపొందించిన విధివిధానాలను ప్రాతిపదికగా తీసుకుని తమ ప్రభుత్వం రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించిందని వెల్లడించారు.
సీఎం రిలీఫ్ ఫండ్‌కు కురుమ సంఘం విరాళం
వరదల బాధితులను ఆదుకునేందుకు కురుమ సంఘం ముందుకు వచ్చింది. సీఎం రిలీఫ్ ఫండ్ కు తెలంగాణ కురుమ సంఘం తరపున ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, ఎంపీ చామల, యాదాద్రి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అండెం సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో రూ.10 లక్షల చెక్ అందజేశారు.