
- తెలంగాణ అభివృద్ధిపై చిత్తశుద్ధితో ఉన్నాం
న్యూఢిల్లీ, వెలుగు: అసెంబ్లీలో మైక్ ఇస్తే ప్రతిపక్ష నేత కేటీఆర్ మైక్ టైసన్‌లా మారిపోతున్నాడని ఎంపీ చామల ఎద్దేవా చేశారు. తెలంగాణ బ్రాండ్, డెవలప్‌మెంట్ కోసం కాంగ్రెస్ తీసుకొచ్చే ఏ విషయాన్ని ఒప్పుకునే స్థితిలో ఆయన లేడని విమర్శించారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉందన్నారు. తెలంగాణ రైజింగ్‌కు సంబంధించి భారత్ సమిట్‌ను నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించడాన్ని తాము తప్పుబట్టడం లేదని, కేబినెట్‌లో తీర్మానం చేయకుండా వారి అనుచరులకు లబ్ధి చేకూరేలా రేస్ నిర్వహించడాన్ని వ్యతిరేకించామన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేది పాలనకు సంబంధించిన అంశమని, మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ బ్రాండ్‌కు సంబంధించినవి చెప్పారు. . పార్లమెంట్‌లో ప్రతిపక్షాలను అవమానించేలా స్పీకర్ ఓం బిర్లా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ మాట్లాడుతున్న సమయంలో సభను స్పీకర్ వాయిదా వేసి వెళ్లిపోయారని మండిపడ్డారు.
ఎల్ఐఎసీ ఏజెంట్లకు శాపంగా కొత్త రూల్స్
కేంద్రం తెచ్చిన కొత్త నిబంధనలను దేశ బీమా రంగానికి వెన్నెముకగా నిలిచే ఎల్‌ఐసీ ఏజెంట్ల పాలిట శాపంగా మారాయని, వెంటనే ఈ నిబంధనలపై సమీక్ష జరపాలని ఎంపీ చామల విజ్ఞప్తి చేశారు. అంతకుముందు లోక్‌సభ జీరో అవర్‌లో ఎల్‌ఐసీ ఏజెంట్ల సమస్యలపై మాట్లాడుతూ.. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ (ఐఆర్‌డీఏ) ఇటీవల పాలసీల్లో తెచ్చిన మార్పులతో ఏజెంట్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. తొలి ఏడాది కమీషన్‌ను 35 శాతం నుండి 28 శాతానికి తగ్గించే నిబంధన ఏజెంట్లపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.