
- హరీశ్‌రావుకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ మాట్లాడితే నీతులు, ఎదుటి వాళ్లు మాట్లాడితే బూతులా అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావును ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. బూతు పురాణానికి పేటెంట్ హక్కు అంటూ ఉంటే అది మీ మామ కేసీఆర్‌దేనని ఆదివారం ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. “గత పదేండ్లలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీ మామ కేసీఆర్ ఎన్నో బూతు మాటలు, తిట్టిన తిట్లతో ఒక బూతు పుస్తకమే రాసి ఉండొచ్చు. హరీశ్ రావు ఇయ్యాల నీతులు చెబుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది.
రేవంత్ మాటల గురించి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదన్న విషయం గుర్తుంచుకోవాలి. మీ మామ ప్రజా వేదికలపై, అసెంబ్లీలో మాట్లాడిన మాటలు మీరు మర్చిపోవచ్చు.. కానీ తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. కేసీఆర్ బూతులు యూట్యూబ్‌లో వందల కొద్దీ వీడియోలు ఉన్నాయి. మనం ఎదుటివారిని అనే ముందు ఇతరులు గురించి మాట్లాడే ముందు ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకో”అని చామల అన్నారు.