నినాదాలు బాగున్నయ్ .. ఆచరణ ఏదీ : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

నినాదాలు బాగున్నయ్ .. ఆచరణ ఏదీ : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
  • రైతులకు కేంద్రం చేసింది శూన్యం
  • కేంద్ర బడ్జెట్ రైతుల కోసం కాదు.. కార్పొరేట్ల కోసమే పెట్టినట్టుందని విమర్శ

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్రంలోని బీజేపీ సర్కారు పదేండ్ల పాలనలో రైతులకు చేసింది శూన్యమని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం కార్పొరేట్ల కోసమే తెచ్చినట్టు ఉందని..  అన్నం పెట్టే రైతన్నకు బడ్జెట్ లో ఇచ్చింది సున్నా అని అన్నారు. శుక్రవారం లోక్ సభలో అగ్రికల్చర్ గ్రాంట్లపై చామల మాట్లాడారు. కేంద్రం చెప్పే ‘సబ్ కా సాత్– సబ్ కా వికాస్, అచ్చా దిన్ ఆనే వాలా హై, వికసిత్ భారత్, ఆత్మ నిర్భర్ భారత్, ఘర్ ఘర్ – రోజ్ గార్’ నినాదాలు చాలా బాగున్నాయని, కానీ వాటి ఆచరణ మాత్రం లేదని కౌంటర్ ఇచ్చారు. దేశ జనాభాలో 60 శాతం మంది రైతులు ఉంటే, వారి కోసం బడ్జెట్ లో కేవలం 3.8 శాతం మాత్రమే కేటాయింపులు చేయడం సిగ్గు చేటన్నారు.

 2024– 25 వార్షిక బడ్జెట్ లో రైతుల కోసం రూ. 1.41 లక్షల కోట్లు కేటాయిస్తే.. ప్రస్తుత బడ్జెట్(2025–26)లో రూ.1.37 లక్షల కోట్లకు తగ్గించారన్నారు. సబ్ కా సాత్ – సబ్ కా వికాస్ అంటే ఇదేనా? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ సర్కారు తన కార్పొరేట్ దోస్తులకు రూ. 3 లక్షల కోట్లు మాఫీ చేసిందని.. మరి పదేండ్లలో రైతులకు ఎన్ని లక్షల కోట్లు రుణమాఫీ చేశారో చెప్పాలన్నారు. కనీస మద్దతు ధర లేదని, స్వామి నాథన్ కమిషన్ సిఫారసులను తుంగలో తొక్కారని ఫైర్ అయ్యారు. పీఎం ఫసల్ బీమా యోజనకు కూడా నిధులు 22.9 శాతం తగ్గించారన్నారు. విత్తనాల రేట్లు ఆకాశాన్ని అంటాయని, ఎరువులు, రసాయనాలు, డీజీల్ రేట్లు చెప్పనవసరమే లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కేంద్రం రైతుల గురించి ఆలోచించాలని కోరారు. 

కాంగ్రెస్ ఒక్కటే రైతుల పక్షం.. 

దేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే రైతుల పక్షాన ఉందని ఎంపీ చామల అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో రైతులకు రూ. 60 వేల కోట్ల రుణమాఫీ చేసిందన్నారు. తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు 22.35 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణాలు మాఫీ చేసిందన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో రైతులకు 20 శాతం నిధులు కేటాయించామని చెప్పారు. రైతు భరోసా కింద ఎకరానికి ఏడాదికి రూ. 12 వేలు ఇస్తున్నామన్నారు. సన్న వడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్ అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో వరి సాగు 40 లక్షల ఎకరాలు పెరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, దేశవ్యాప్తంగా సన్న, చిన్నకారు రైతులకు రుణమాఫీ చేయాలని చామల డిమాండ్ చేశారు.