వాయిదాపై త్వరలో నిర్ణయం: ఎంపీ చామల, ఎమ్మెల్సీ బల్మూరి

వాయిదాపై త్వరలో నిర్ణయం: ఎంపీ చామల, ఎమ్మెల్సీ బల్మూరి
  • నిరుద్యోగులతో చర్చలో ఎంపీ చామల, ఎమ్మెల్సీ బల్మూరి

హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేసే విషయంపై రాష్ట్ర సర్కార్ త్వరలోనే ఓ నిర్ణయానికి రానున్నదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. నవంబర్ చివరికి లేదంటే.. డిసెంబర్ మొదటి వారానికి గ్రూప్ 2 వాయిదా వేయాలనే నిరుద్యోగుల డిమాండ్​పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించే చాన్స్ ఉందని తెలిపారు. 

బేగంపేటలోని హరితా ప్లాజాలో గురువారం నిరుద్యోగులతో ప్రభుత్వం తరఫున ఎంపీ చామల, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భేటీ అయి సమస్యలపై చర్చించారు. డీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్  2 పరీక్షల నిర్వహణపై ఎదుర్కొంటున్న ఇబ్బందులను నిరుద్యోగులు వారి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ‘‘మీ సమస్యలన్నింటినీ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తా. 

గ్రూప్ 2 వాయిదా వేసే విషయంపై సర్కార్ ఆలోచిస్తున్నది. రాష్ట్ర సర్కార్ నిరుద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నది. ఎవరూ ఆందోళన చెందొద్దు. ఖాళీల భర్తీపై ఎప్పటికప్పుడు సీఎం రివ్యూ చేస్తున్నారు. మూడు నెలల్లోనే 30వేల ఉద్యోగాలు ఇచ్చాం. పదేండ్లలో బీఆర్ఎస్ ఎన్ని జాబ్​లు ఇచ్చిందో అందరికీ తెలుసు. డీఎస్సీ ఎగ్జామ్ ప్రారంభమైంది. అందరూ బాగా రాయాలి’’అని అన్నారు. 

నిరుద్యోగ సమస్యల పరిష్కారంపై రేవంత్ ఫోకస్

సీఎం రేవంత్ నిరుద్యోగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తున్నది. నిరుద్యోగులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ.. వారి సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ ఇప్పటికే ఒక కమిటీ వేశారు. ఇందులో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, కాంగ్రెస్ నేతలు మానవతారాయ్, బాల లక్ష్మీ, చరణ్ కౌశిక్, చనగాని దయాకర్ సభ్యులుగా ఉన్నారు.

 ఇప్పటికే వీరు నిరుద్యోగులతో పలు సందర్భాల్లో సమావేశమై వారి సమస్యలను రేవంత్ దృష్టికి తీసుకొచ్చారు. నిరుద్యోగుల సమస్యలను జఠిలం చేయకుండా వారి డిమాండ్లను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, అందులో సాధ్యమయ్యే వాటికి పరిష్కారం చూపడమే లక్ష్యంగా రేవంత్ ఈ కమిటీ వేశారు.

సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా: బల్మూరి

డీఎస్సీ, గ్రూప్ 2 పరీక్షకు మధ్య గ్యాప్ చాలా తక్కువగా ఉందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన కాదని తెలిపారు. గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేయాలనే డిమాండ్​పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉందన్నారు. సమస్యలన్నీ సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తానని, జాబ్ క్యాలెండర్ కూడా త్వరలోనే ప్రకటించేలా కృషి చేస్తానని తెలిపారు. 

గ్రూప్ 1లో మెయిన్స్​కు 1:100కు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నట్టు గుర్తు చేశారు. ఇది సాధ్యం కాదని.. ఇలా చేయడంతో పలు టెక్నికల్ సమస్యలు వస్తాయన్నారు.