ఆరు నెలల్లోనే రైతు రుణమాఫీ చేశాం : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

చౌటుప్పల్, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే రైతు రుణమాఫీ చేసి ఇచ్చినమాట నిలబెట్టుకున్నామని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్ లోని ఆందోల్ మైసమ్మ ఆలయ19వ వార్షికోత్సవం నిర్వహించారు. వార్షికోత్సవంలో ఎంపీ చామల పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంపీ టికెట్ వచ్చిన రోజే మైసమ్మ తల్లి దీవెనలు తీసుకొని ప్రచారం నిర్వహించి విజయం సాధించానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు.

జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రానున్న ఐదేళ్లలో తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీని  ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. ఆయన వెంట నాయకులు పబ్బరాజు గౌడ్, చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, వెంకటరెడ్డి, సుర్వి నరసింహాగౌడ్, ఆలయ అధికారులు, ఉన్నారు.