- ‘ఫార్ములా’ కేసు నుంచి తప్పించుకునేందుకు అండర్ కవర్ ఆపరేషన్లు: చామల
- బదులుగా మహారాష్ట్రలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇస్తున్నదని కామెంట్
న్యూఢిల్లీ, వెలుగు: బీజేపీతో సెటిల్మెంట్లు, అవినీతి కేసుల్లో బెయిల్స్ కోసమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. గతంలో లిక్కర్ స్కాంలో కవిత బెయిల్ కోసం, ఇప్పుడు ఫార్ములా–ఈ రేస్ కేసులో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీలో అండర్ కవర్ ఆపరేషన్లు చేస్తున్నారని ఆరోపించారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మీడియాతో చామల మాట్లాడారు. ‘‘కవిత బెయిల్ కు బదులుగా లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ లొంగిపోయింది.
ఇప్పుడు అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇస్తున్నది” అని అన్నారు. ఈ సందర్భంగా తాను ఏఐసీసీ అబ్జర్వర్ గా పని చేస్తున్న చంద్రపూర్ నియోజకవర్గంలో మహాయుతి కూటమి పార్టీలు, బీఆర్ఎస్ జెండాలతో కూడిన ప్రచార వాహనం ఫొటోలను మీడియాకు చూపించారు. తెలంగాణ ప్రజల సొమ్ముతో మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నదంటూ బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు చెబుతున్నారని చామల మండిపడ్డారు. ‘‘రేవంత్ రెడ్డికి సృజన్ బావమరిది కాదు.. దూరపు చుట్టం. అమృత్ స్కీంలో సృజన్ రెడ్డికి చెందిన కంపెనీలకు ప్రభుత్వం 80 శాతం పనులను అప్పగించలేదు. తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలుపై మహారాష్ట్రలో ఇచ్చిన పత్రిక ప్రకటనలు పూర్తిగా పార్టీ ఖర్చుతో ఇచ్చినవే” అని స్పష్టం చేశారు. కేసీఆర్ లెక్క ప్రభుత్వ ఖర్చుతో పార్టీ ప్రకటనలు చేయలేదన్నారు.