సమగ్ర సర్వేతోనే సామాజిక న్యాయ :  భువనగిరి ఎంపీ చామల 

సమగ్ర సర్వేతోనే సామాజిక న్యాయ :  భువనగిరి ఎంపీ చామల 
  •     కిరణ్​కుమార్ రెడ్డి 

యాదాద్రి, వెలుగు : సామాజిక న్యాయం కోసమే ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి అన్నారు. ఈ సర్వే ద్వారా రాజ్యాంగ ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు సమానంగా అందుతాయని తెలిపారు. పీసీసీ పిలుపు మేరకు సమగ్ర కుటుంబ సర్వేపై కాంగ్రెస్​ శ్రేణులకు అవగాహన కల్పించడానికి జిల్లా స్థాయిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినప్పటికీ కొన్ని వర్గాలు అభ్యున్నతిలో వెనుకబాటుకు గురయ్యాయన్నారు.

ఆయా వర్గాల అభ్యున్నతి కోసమే ఈ సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సర్వే ద్వారా రానున్న రోజుల్లో ప్రభుత్వ పథకాల రూపకల్పన, అమలు జరుగుతుందని వివరించారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్ రెడ్డి మాట్లాడుతూ సమగ్ర కుటుంబ సర్వేపై కాంగ్రెస్​ శ్రేణులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసేవారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. 

ఎమ్మెల్సీ తీన్మార్​మల్లన్న మాట్లాడుతూ కులాల వారీగా1931 తర్వాత నిర్వహిస్తున్న ఈ సర్వేకు ఎంతో ప్రాధాన్యముందన్నారు. సర్వేను బీజేపీ, బీఆర్ఎస్​ వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత పెరుగుతుందని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు పోత్నక్​ ప్రమోద్​కుమార్, నీలం పద్మ, జనగాం ఉపేందర్ రెడ్డి, చీర శ్రీశైలం, కే.సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.