- ఎవరితోనూ చర్చించకుండా నివేదిక రెడీ చేశారు : చామల
హైదరాబాద్, వెలుగు: జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్ట్‌లో వాస్తవాలు లేవని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో పర్యటించకుండా, ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా, ఎవరితో సమావేశం కాకుండా ఏకపక్షంగా రిపోర్ట్ రెడీ చేశారని ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని ఇప్పటికే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే వ్యతిరేకించారని గుర్తుచేశారు.
వన్ నేషన్.. వన్ ఎలక్షన్.. గురించి కేంద్రం.. కేబినెట్ మీటింగ్ పెట్టి చర్చించే ముందు ప్రజలకు కూడా వాస్తవాలు చెప్పాల్సిందన్నారు. గురువారం గాంధీ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగంలో 18 సవరణలు చేయాల్సి ఉంటుందని, పార్లమెంట్ ఉభయ సభల్లో 2/3 వంతు ఎంపీలు ఆమోదించాలని , 14 రాష్ట్రాలు మద్దతు తెలపాలని గుర్తుచేశారు.
ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉద్యోగులు, పోలీసులు, ఇతర సిబ్బంది తదితర ఎన్నో అంశాలు ముడిపడి ఉంటాయని, రాష్ట్రాల మద్దతు లేకుండా జమిలి ఎన్నికలు సాధ్యం కావన్నారు. ప్రస్తుతం 4 రాష్ట్రాల ఎన్నికలే ఒకేసారి నిర్వహించలేకపోతున్నారని, ఎంపీ ఎన్నికలు 7 దశల్లో నిర్వహించారని, అలాంటప్పుడు జమిలి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ప్రజల దృష్టి మళ్లించడానికి కేంద్ర ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ఆరోపించారు. ప్రపంచంలో 194 దేశాలు ఉంటే, కేవలం 10 దేశాల్లోనే జమిలి ఎన్నికలు అమల్లో ఉన్నాయని చెప్పారు. లోక్‌సభ పదవీకాలాన్ని నిర్ణయించే ఆర్టికల్ 83, అసెంబ్లీల పదవీకాలాన్ని నిర్ణయించే ఆర్టికల్ 172లో.. మూడేసి సెక్షన్లను సవరించాల్సి ఉంటుందని గుర్తుచేశారు.