- లోక్‌సభ వేదికగా కేంద్రానికి ఎంపీ చామల విజ్ఞప్తి
న్యూఢిల్లీ, వెలుగు: మూసీ రివర్ డెవలప్మెంట్ కు ఆర్థిక, సాంకేతిక మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం లోక్‌సభలో మూసీ పునరుజ్జీవం అంశాన్ని రూల్ 377కింద లేవనెత్తారు. ఒకప్పుడు హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాలకు మూసీ కీలకమైన నీటి వనరుగా ఉండేందని సభకు తెలిపారు. ఇప్పుడు మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలతో తీవ్రంగా కలుషితమైందని పేర్కొన్నారు.
నల్గొండ జిల్లాలోని దాదాపు 40వేల ఎకరాల సాగుభూమి కలుషిత నీటికి గురవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి తోడు బోర్‌వెల్‌లు, చిన్న చిన్న కుంటలు, కాల్వల ద్వారా అదనంగా మరో 60వేల ఎకరాలు కలుషిత భూగర్భ జలాలుగా మారాయని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు సాంకేతిక సహకారం అందిచాలన్నారు.