మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కరోనా మహమ్మారిని జయించారు. గత కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరిన ఆయన బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. జూలై 25న సీఎం శివరాజ్ సింగ్‌కు కరోనా నిర్థారణ అయింది. దీంతో వైద్యుల సూచన మేరకు ఆయన భోపాల్‌లోని చిరయు ఆసుపత్రిలో చేరారు. 11 రోజుల చికిత్స అనంతరం కరోనా నుంచి కోలుకుని నేడు డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అనంతరం వారం రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా డాక్టర్లు శివరాజ్ సింగ్‌కు సూచించారు.
డిశ్చార్జి సందర్భంగా డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు సీఎం శివరాజ్ సింగ్. వారితో కలిసి ఫొటోలు దిగారు. కరోనా అంత ప్రమాదకరమైన వ్యాధేమీ కాదని.. అలాగని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోతాయని శివరాజ్ సింగ్ అన్నారు. ఏ మాత్రం కరోనా లక్షణాలు కనిపించినా పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. కరోనాకు మందు, వాక్సిన్ వచ్చే వరకు భౌతిక దూరమే ఏకైక మార్గమని చెప్పారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని విజ్ఞప్తి చేశారు.
రెండు రోజుల క్రితం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, పరీక్షల అనంతరం డిశ్చార్జ్ అవుతానని శివరాజ్ సింగ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.