మధ్యప్రదేశ్లోని రీవా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి ఉచితంగా చికిత్సను అందిస్తున్నామని, వారిలో ఒక్కొక్కరికి రూ.10,000 ఇస్తున్నామని వెల్లడించారు. గాయపడిన వారికి సంజయ్ గాంధీ మెడికల్ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు.
రీవా జిల్లాలోని కొండ ప్రాంతంలో ట్రక్కును ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో 15మంది మృతి చెందగా, 40మందికి పైగా గాయపడ్డారు. సుమారు 100మంది ప్రయాణికులతో వెళ్తోన్న బస్సు ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన కూలీలుగా పోలీసులు గుర్తించారు. దీపావళి పండుగ సందర్భంగా వారంతా తమ స్వస్థలాలకు వెళ్తున్నారని చెప్పారు.
రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోడీ విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు పిఎమ్‌ఎన్‌ఆర్‌ఎఫ్ నుండి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.50,000 అందజేయనున్నట్లుగా పీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది.