- పదేండ్లలో దోపిడీ తప్ప అభివృద్ధి జరగలే
- తెలంగాణ తల్లి విగ్రహంపై రాజకీయాలొద్దు
- హామీల అమలులో కాంగ్రెస్ ఫెయిల్ అయిందని ఫైర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభు త్వం మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ దోపిడీ కొనసాగుతోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. అవినీతి అధికారులు, దోపిడీ చేసిన కాంట్రాక్టర్లను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోందని.. గత సీఎం కేసీఆర్, ప్రస్తు త సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ దుర్మార్గులేనని ఫైర్ అయ్యారు.
మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో అర్వింద్ మాట్లాడారు. రాష్ట్రానికి కొత్తగా 7 నవోదయ స్కళ్లు కేటాయించినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయ కుండా ఏడాది కాలంగా మోసం చేస్తోందన్నారు. ఎడాపెడా వాగ్దానాలు ఇవ్వొద్దని ఇప్పుడు స్వయంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చెప్తున్నారని, ఎన్నికల సమయంలో వారికి తెలియకుండానే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీలు ఇచ్చిందా? అని ప్రశ్నించారు.
హామీ లు అమలు చేయకుంటే కాంగ్రెస్ కు కూడా బీఆర్ఎస్ గతే పడుతుందన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మీద రాజకీయం సరికాదన్నారు. గత పదేండ్లలో విగ్రహం విషయంలో ఎందుకు జీవో తేలేదో బీఆర్ఎస్ నేత కేటీఆర్ చెప్పాలన్నారు. తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్కు కమిట్మెంట్ లేదన్నారు. రాష్ట్రంలో గత పదేండ్లలో దోపిడీ తప్ప అభివృద్ధి జరగలేదన్నారు. అసెంబ్లీలో మైక్ ఇవ్వడంలేదని కేటీఆర్ అంటున్నారని.. కానీ, బీఆర్ఎస్ అధ్యక్షుడే ప్రజల సమస్యలపై కొట్లాడటం లేదన్నారు.
వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో బ్రౌన్ ఫీల్డ్, నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి వద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు మంజూరయ్యాయని అర్వింద్ తెలిపారు. ఈ మూడు చోట్ల ఎయిర్ పోర్టుల నిర్మాణం కోసం అబ్ స్టకల్ లిమిటేషన్ సర్వే చేయడంతోపాటు కేంద్రం నుంచి ఇతర అనుమతులు తీసుకోవాలన్నారు. జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్టు నిర్మాణం కాంగ్రెస్ సర్కారు వల్లే ఆలస్యం అవుతోందన్నారు.
- గుజరాత్ గురించి ఏం తెలుసు?
గుజరాత్ మోడల్ గురించి సీఎం రేవంత్ రెడ్డికి ఏం తెలుసని అర్వింద్ ప్రశ్నించారు. బీఆర్ఎస్-, కాంగ్రెస్‌కు గుజరాత్ మోడల్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ప్రధాని మోదీ అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్‌తో లక్షకు పైగా చెక్ డ్యాంలు కట్టి భూగర్భ జలాలు పెంచారన్నారు. హైడ్రా ఓల్డ్ సిటీకి వెళ్లకుండా మూసీ
ప్రక్షాళన ఎలా సాధ్యమవుతుంది? అని ప్రశ్నించారు.