
మెట్ పల్లి, వెలుగు: పదేండ్లు కేసీఆర్ సర్కారు దోచుకున్నట్టే.. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు ఫోకస్ పెట్టిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. సోమవారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోజన్ కొత్తూరులో అకాల వర్షానికి నష్టపోయిన పంట పొలాలు, తోటలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల కురిసిన అకాల వర్షానికి జిల్లాలో సుమారు12 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు చెబుతున్నారని, కానీ సుమారు 20 వేల ఎకరాల్లో వరి, మామిడి, నువ్వులు, సజ్జ పంటలు దెబ్బతిన్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు.
అన్నదాతల కోసం మోడీ ప్రభుత్వం ఫసల్ బీమా యోజన తెస్తే కేసీఆర్ పాలనలో తెలంగాణలో అమలు చేయలేదని, ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కూడా పట్టించుకోవడంలేదన్నారు. పంటలకు బీమా ఉంటే రైతుకు ధీమా ఉంటుందన్నారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 50 వేలు నష్టపరిహారం ఇవ్వాలని వ్యవసాయ మంత్రి, జగిత్యాల కలెక్టర్ కు లెటర్ రాసినట్లు తెలిపారు. పంట నష్ట పరిహారంపై రాష్ట్రం కేంద్రానికి ప్రపోజల్స్ పంపాలని సూచించారు. ఆయన వెంట రాష్ట్ర నేత రఘు ఉన్నారు.