- చెప్పులు, చీపుర్లతో ప్రజలు స్వాగతించాలె
- నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్
నిజామాబాద్, వెలుగు : కేసీఆర్ ఎక్స్పైరీ డేట్దగ్గరపడ్డ లీడర్ అని, పార్టీ నాయకత్వం చేపట్టడానికి హరీశ్‌రావు, కేటీఆర్ మధ్య గొడవలు జరుగుతున్నాయని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి తెలిపారు. ఆదివారం ఆయన బీజేపీ జిల్లా పార్టీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. హరీశ్‌రావు పాదయాత్ర చేస్తానని చెప్పగానే .. తానూ పాదయాత్ర చేపడతానని కేటీఆర్ ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు.
ఏ ముఖంతో ప్రజల మధ్యకు వెళ్తారని ప్రశ్నించారు. కేటీఆర్ ఎప్పుడు వచ్చినా ప్రజలు చెప్పులు, చీపుర్లతో స్వాగతం పలుకాలన్నారు. పదేండ్ల అధికారంతో కళ్లు నెత్తికెక్కి గాలిలో తేలిన బీఆర్ఎస్ కాళ్లను నేలకు తాకించడానికి ఎలక్షన్లో ప్రజలు ఓడించారని విమర్శించారు.
కమీషన్ల కోసం ప్రాజెక్టులు
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేసి, భారీ కమీషన్లు వసూలు చేశారని ఫైరయ్యారు. జిల్లాలోని మంచిప్ప ప్యాకేజీ పనుల్లో భాగంగా 2100 కోట్లతో పైపులు కొని, కాంట్రాక్టర్‌కు లాభాలు కట్టబెట్టఇందని, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడక్కడ సర్వే షురూ చేసిందన్నారు. మంచిప్ప ప్రాజెక్టు నిర్మిస్తే అనేక విలేజ్‌లు మునిగి గిరిజనులు భూములు కోల్పోతారని అనారు.
కొబ్బరికాయలు కొట్టేందుకే సెంటర్లు ఓపెన్
సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలు అమలు సాధ్యంకావని, రుణమాఫీ, కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ స్కీం కింద తులం బంగారం పేరుతో ప్రజలను ఆయన మోసం చేశారని హిందూ దేవుళ్లపై ఒట్లు పెట్టి ధర్మాన్నీ చులకన చేశారన్నారు. అబద్దాలు చెప్పడంలో రేవంత్ కేసీఆర్‌ను మించిపోయారని ఆయన్ను మిత్రుడిగా చెప్పలేకపోతున్నానన్నారు. కొబ్బరికాయలు కొట్టడానికే వడ్ల కొనుగోలు సెంటర్లు తెరిచారని , కొనుగోళ్లు మరిచారని విమర్శించారు.
దేశానికి మజ్లిస్ ఒక క్యాన్సర్‌లాంటిదని అన్నారు. కాంగ్రెస్ రూపొందించిన వక్ఫ్‌బోర్టు చట్టానికి బీజేపీ సవరణలు చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఫ్లోర్ లీడర్ స్రవంతిరెడ్ది, గంగాధర్, శేఖర్ పాల్గొన్నారు.