ఎంపీ అర్వింద్ పట్టున్న సీటు వదిలేసి ఓడిపోయిండు

  •     ఆర్మూర్ నుంచి పోటీ చేస్తానన్న ఎంపీ అర్వింద్
  •     చివరి క్షణంలో కోరుట్లకు మారడంతో ఓటమి

నిజామాబాద్, వెలుగు :  ఆర్మూర్ బరిలో నిలుస్తారని భావించిన ఎంపీ ధర్మపురి అర్వింద్ చివర్లో కోరుట్ల సెగ్మెంట్ ఎంచుకోవడంతో మూల్యం చెల్లించుకున్నట్లయింది. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ 10వేల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు. నిజామాబాద్ ఎంపీగా అర్వింద్ గెలిచాక.. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఆర్మూర్​పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అక్కడే ఇల్లు కట్టుకొని బీజేపీ విస్తరణకు కృషి చేశారు. నిజానికి జిల్లాలో మొదటి నుంచి కమలానికి గట్టిపట్టున్న సెగ్మెంట్ ఆర్మూరే. సిట్టింగ్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో మీడియా వార్ నడిచిన అనేక సందర్భాల్లో ఆర్మూర్​లో ఓడిస్తానని అర్వింద్ సవాల్ చేసేవారు. అసెంబ్లీ ఎలక్షన్ దగ్గరపడ్డ టైమ్​లో సవాల్ చేసినట్టే.. ఆ సెగ్మెంట్​నే ఎంచుకుంటారని అందరూ భావించారు. తర్వాత అర్వింద్ నాయకత్వంలో వ్యాపారవేత్త పైడి రాకేశ్ రెడ్డి బీజేపీలో చేరారు. తర్వాత ఆర్మూర్ అభ్యర్థిగా రాకేశ్ రెడ్డి పేరు ప్రకటించారు. దీంతో అర్వింద్ కోరుట్లకు షిఫ్ట్ అయి చివరికి ఓడిపోయారు.

అన్నపూర్ణమ్మకు ఛాన్స్ మిస్

ఆర్మూర్ ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచిన ఏలేటి అన్నపూర్ణమ్మ పేరును కూడా బీజేపీ హైకమాండ్ పరిశీలించింది. బాల్కొండ కేంద్రంగా రాజకీయాల్లో ఎదగడానికి ప్రయత్నిస్తున్న కొడుకు డాక్టర్ మల్లికార్జున్ రెడ్డికి అండగా ఉండాలనేది ఆమె ఆరాటం. మొదట బాల్కొండలో మల్లికార్జున్ రెడ్డిని పోటీ చేయించాలనుకున్న అధిష్టానం.. అక్కడి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అన్నపూర్ణమ్మే ధీటైన అభ్యర్థి అవుతారని ఆమెను ఎంపిక చేసింది. అయితే, ఆమె దీన్ని తిరస్కరించారు.