డిచ్పల్లి, వెలుగు: నిజామాబాద్ పార్లమెంట్పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ జెండా ఎగరేస్తామని ఎంపీ ధర్మపురి అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం డిచ్‌పల్లిలో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హజరయ్యారు. ఈ సందర్భంగా అర్వింద్ మాట్లాడుతూ ఎన్నికల వేళ ప్రతికార్యకర్త పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు.
నిజాం షుగర్ ఫ్యాక్టరీ, సాగు నీరు, జక్రాన్‌పల్లి ఎయిర్పోర్ట్ లాంటిఅనేక స్థానిక సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని మండిపడ్డారు. తెలంగాణ వర్సిటీని అవినీతి, అక్రమాలకు అడ్డగా మార్చారని ఆరోపించారు. రూరల్టికెట్వస్తే దినేశ్‌కుమార్ కులాచారి వంద శాతం విజయం సాధిస్తారన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, రూరల్ ఇన్చార్జ్ దినేశ్ కుమార్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, ఎంపీపీ గద్దె భూమన్న, ప్రజాప్రతినిధులు, లీడర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం..
బోధన్: బీజేపీని గెలిపిస్తే బోధన్ లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని ఎంపీ ధర్మపురి అర్వింద్హామీ ఇచ్చారు.ఆదివారం బోధన్ లోని రవి గార్డెన్ లో జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి రాగానే బోధన్, మెట్ పల్లి, మెదక్ ప్రాంతాల్లోని షుగర్ఫ్యాక్టరీలను మూసివేశారని మండిపడ్డారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో షుగర్ ఫ్యాక్టరీలు లాభాల్లో నడుస్తున్నట్లు గుర్తు చేశారు. ఎమ్మెల్యే షకీల్ కు, కవితకు ఓట్లు వేసి గెలిపిస్తే ఫ్యాక్టరీ భూములు అమ్ముకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారని ఆరోపించారు.
ఆలోచన చేసి ఓట్లు చేయాలన్నారు. బోధన్ లోని హిందూ పేరుతో ఉన్న కాలనీలను ముస్లిం పేర్లుగా మారుస్తున్నారని, స్థానిక యువకులు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. బోధన్ దొంగ పాస్ పోర్టులకు, దొంగ ఓట్లకు అడ్డాగా మారిందన్నారు. గుట్టలు కూలగొట్టి అక్రమ మొరం, ఇసుక దందా చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గసభ్యులు మేడపాటి ప్రకాశ్‌రెడ్డి, వడ్డీమోహన్ రెడ్డి, అడ్లూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.