కవిత పొగడ్తలతో మంత్రి బిత్తర.. నిజామాబాద్ ఎంపీ అర్వింద్​ ఎద్దేవా

నిజామాబాద్, వెలుగు: బాల్కొండ నుంచి పోటీ పడ్తున్న మంత్రి ప్రశాంత్​రెడ్డి ఎమ్మెల్సీ కవితను పొగుడుతుంటే, ఆమె మాత్రం కాంగ్రెస్ ​క్యాండిడేట్ ​సునీల్​రెడ్డిని పొగడడంతో ప్రశాంత్​రెడ్డి బిత్తరపోతున్నారని ఎంపీ అర్వింద్​ ఎద్దేవా చేశారు.  మంగళవారం కలెక్టరేట్​లో దిశా మీటింగ్​తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు..  ప్రశాంత్​రెడ్డి మంత్రిగా ఉండడం బాధాకరమని, కవితతో కలిసి ఆయన అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. వాళ్లడిగే కమీషన్లకు భయపడి జిల్లాకు ఒక్క పరిశ్రమ రావడం లేదన్నారు. 

తనతో కవిత పోటీ చేసేలా మంత్రి ప్రశాంత్​రెడ్డి ఆమెను ఒప్పించాలని, ఆమెను మూడో స్థానానికి పరిమితం చేస్తానన్నారు.  డెవలెప్​మెంట్​పేరుతో చేయిస్తున్న పనులకు బిల్లులు చెల్లించడం లేదని ఎంపీ పేర్కొన్నారు.  కమీషన్లు వచ్చే పనులు మాత్రమే చేయించి అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారన్నారు.  అంతకుముందు దిశా మీటింగ్​లో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఫండ్స్​తో జిల్లాలో చేసిన పనులకు స్టేట్​సర్కార్​పబ్లిసిటీ పొందడం ఏమిటని ఫైర్​ అయ్యారు. శిలాఫలకాలపై కేంద్ర ఫండ్స్ వివరాలు రాయించాలని కలెక్టర్​రాజీవ్​గాంధీ హన్మంతును కోరారు.  దిశా మీటింగ్​లో అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, యాదిరెడ్డి, నగర పాలక కమిషనర్​ మంద మకరంద్​ పాల్గొన్నారు.