24 గంటల విద్యుత్ సరఫరాపై అన్నీ అబద్దాలే మంత్రి కేటీఆర్ మత్తులో నుంచి బయటికొచ్చి మాట్లాడాలె

24 గంటల విద్యుత్ సరఫరాపై బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తున్న మాటలన్నీ  అవాస్తవాలని  ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. అసలు రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా అవడం లేదన్నారు. డ్రగ్స్ మత్తులో ఉండే మంత్రి కేటీఆర్కు ఏం తెలుసని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ మత్తులో నుంచి బయటకు వచ్చి మాట్లాడాలని సూచించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం గండి హనుమాన్ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కోరుట్ల నియోజవర్గ బీజేపీ నాయకుల టిఫిన్ బైఠక్ కార్యక్రమంలో  ఎంపీ ధర్మపురి అర్వింద్ పాల్గొన్నారు.

కుల రాజకీయాలు చేసే కాంగ్రెస్ కు.. కుటుంబ రాజకీయాలు చేసే బీఆర్ఎస్ కు అభివృద్ధి అవసరం లేదని ఎంపీ అర్వింద్ మండిపడ్డారు. వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్.. లక్షసార్లు చీలిందన్నారు.  అన్ని రాష్ట్రాలలో కూడా ఆ పార్టీ ఎన్నోసార్లు చీలిందని గుర్తు చేశారు. కానీ బీజేపీ వసుధైక కుటుంబ పార్టీ అన్నారు. అందరూ కుటుంబ సభ్యుల్లా కలిసి చర్చించుకోవడానికి టిఫిన్ బైఠక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. అందరూ ఐకమత్యంగా ఉంటూ పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.