ఢిల్లీలో అర్వింద్ ఇన్‌‌‌‌చార్జ్​గా ఉన్న రెండు స్థానాల్లో బీజేపీ విజయం

ఢిల్లీలో అర్వింద్ ఇన్‌‌‌‌చార్జ్​గా ఉన్న రెండు స్థానాల్లో బీజేపీ విజయం

హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక పాత్ర పోషించారు. ఇన్ చార్జ్ గా తనకు బాధ్యతలు అప్పగించిన రెండు సీట్లలోనూ పార్టీని ఆయన గెలిపించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్రమంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, భూపేంద్ర యాదవ్, ధర్మేంద్ర ప్రధాన్, మన్ సుఖ్ మాండవీయ, పీయూష్ గోయల్ తో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు వినోద్ తావ్ డే, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ వంటి సీనియర్ నేతలు 22 మందితో స్ట్రాటజిక్ ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటీని నియమించింది. 

కేంద్రమంత్రి కాకపోయినప్పటికీ ధర్మపురి అర్వింద్ కు ఇందులో అవకాశం కల్పించింది. అంతేకాకుండా ఆప్ సీనియర్ లీడర్ మనీశ్ సిసోడియా పోటీ చేసిన జంగుపురా, పదేండ్లుగా ఆప్ గెలుస్తున్న ఆర్కేపురం లాంటి కీలక స్థానాలకు ఇన్ చార్జ్ గా నియమించింది. ఈ రెండింటిలో పార్టీని గెలిపించే బాధ్యతలను అప్పగించింది. ఈ క్రమంలో పార్టీ విజయం కోసం అర్వింద్ కృషి చేశారు. బూతు స్థాయి కార్యకర్తలతో విస్తృత సమావేశాలు నిర్వహించారు. ఢిల్లీలో సెటిలైన తెలుగు వాళ్లను కూడగట్టారు. తనకు అప్పగించిన రెండు స్థానాల్లోనూ పార్టీని గెలిపించారు.