జీరో బడ్జెట్ కు శ్రీకారం చుట్టా.. అందుకే ఓడిపోయా: ఎంపీ అరవింద్

దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం కొనసాగుతుందని.. అయనే మళ్లీ ప్రధానమంత్రి అవుతారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ జోష్యం చెప్పారు. డిసెంబర్ 26వ తేదీ నిజామాబాద్ జిల్లా బిజెపి కార్యాలయంలో ఎంపీ అర్వింద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజమాబాద్ పార్లమెంటు పరిదిలో 30 శాతం ఓట్లు సాధించటం సంతోషమని.. కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. 

పార్టీని డెవలప్ చేసేందుకె కోరుట్లలో పోటీ చేశానన్నారు.  జీరో బడ్జెట్ ఎన్నికలకు కోరుట్ల ఎన్నికలు నాంది పలికాయని చెప్పారు.  డబ్బులు పంచమని చాలా మంది తనకు చెప్పారని.. కానీ కొత్త తరహా రాజకీయాలకు శ్రీకారం చుట్టే ప్రయత్నం చేశామనని,  పార్టీ సిద్దాంతాలకు అనుగుణంగా డబ్బులు ఖర్చు పెట్టకుండా పోటీ చేశానని అన్నారు. ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టే సంస్కృతి పోవాలన్నారు.

2018తో పోల్చితే నిజమాబాద్ పార్లమెంటు పరిధిలో మా పార్టీ ఓటు బ్యాంకు పెరిగిందని తెలిపారు. కార్యకర్తల కోసం నిరంతరం కష్టపడ్డానని.. పార్టీని బలోపేతం చేశానని అరవింద్ చెప్పారు. గత 5 ఏళ్లలో తన మీద నయా పైసా అవినీతి ఆరోపణలు లేవన్నారు. ఎంపీగా చాలా సంతోషంగా ఉన్నానని.. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ పసుపు బోర్డు తెచ్చానని,  నిధులు తీసుకొచ్చానని చెప్పారు.  పసుపు బోర్డు పనులు ఊపందుకున్నాయని.. రానున్న రోజుల్లో పసుపుకు రూ.20 వేలు మద్దతు ధర ఇప్పిస్తానని  హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. 6 గ్యారెంటీలు ఎట్లా అమలు చేస్తారో చూడాలని .. కొత్త ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు.. వేచి చూస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం, డిప్యూటీ సీఎం కేంద్ర సాయం కోరడం మంచి పరిణామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తప్పకుండా అండగా ఉంటుందని ఎంపీ అరవింద్ చెప్పారు.