తెలంగాణ దోపిడీదారుల భరతం పడ్తం: ఎంపీ అర్వింద్​

నిజామాబాద్, వెలుగు: ప్రజాధనాన్ని దోపిడీ చేసినవారిని బీజేపీ వదిలిపెట్టదని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ప్రభుత్వాన్ని రద్దు చేస్తే రాష్ట్రపతి పాలన వస్తుందని స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణంలో మంగళవారం బీజేపీ నేత మల్లికార్జున్ రెడ్డి జనంతో మనం పాదయాత్ర ముగింపు సభ జరిగింది. సభకు ముఖ్యఅతిథిగా అర్వింద్ హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతిని కూకటివేళ్లతో పెకిలిస్తామని చెప్పారు. రైతుపక్షపాతిగా సర్కారు ప్రకటనల్లో చెప్పుకోవడమే తప్ప ఆచరణలో లేదని విమర్శించారు. బడ్జెట్ లో రైతుల కోసం రూ. 20,64 కోట్లు కేటాయిస్తే అందులో రూ. 1,150 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని అన్నారు. రైతుబంధు పేరిట సబ్సిడీ స్కీమ్ లను ఎత్తేసి రైతులను మోసగిస్తోందని ఆరోపించారు.

పనికి ఆహార పథకం కింద పేదలకు ఇచ్చే డబ్బులో కూడా టీఆర్ఎస్ నేతలు అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే తనపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. జనంతో మనం కార్యక్రమంతో ప్రజాదరణ పెరుగుతోందని చెప్పారు. 15 రోజుల నుంచి దాదాపు 250 కిలోమీటర్లకు పైగా తనతోపాటు కలిసి పాదయాత్ర చేసిన కార్యకర్తలు, గ్రామస్తులకు రుణపడి ఉంటానని బీజేపీ నేత డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి అన్నారు. పాదయాత్రలో భాగంగా నియోజకవర్గంలోని పలు సమస్యలు తన దృష్టికి వచ్చాయని, బీజేపీ అధికారంలోకి రాగానే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణ, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి నరసింహారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్  తదితరులు పాల్గొన్నారు.