నందిపేట, వెలుగు: జిల్లాలో పసుపు రైతులకు ఇచ్చిన హామీ మేరకు స్పైసెస్ బోర్డు ఆ అయోధ్య రాముడి ఆశీస్సులతోనే సాకారమైందని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం నందిపేట, డొంకేశ్వర్ మండలాల్లో ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి తో కలిసి ప్రచారం నిర్వహించారు. నందిపేట నందిచౌక్ వద్ద నిర్వహించిన కార్నర్మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ.. 70 ఏళ్లలో గుర్తుకు రాని గల్ఫ్ బోర్డు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు గుర్తుకు రావడం సిగ్గుచేటన్నారు. మోదీ విజన్ ఉన్న నాయకుడని, ఆయన అడుగుజాడల్లో రైతులు ముందుకు వెళ్లాలన్నారు.
కేంద్ర హోంమంత్రిపై ఫేక్ వీడియో సృష్టించిన కేసులో రేపో మాపో కాంగ్రెస్ వాళ్లే సీఎం రేవంత్ రెడ్డిని జైలుకు పంపించబోతున్నారన్నారు. ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి మాట్లాడుతూ.. మూడు నెలల్లో పెన్షన్లు, ఇళ్లు ఇప్పించే భాద్యత నాదే అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిజంగా హిందువే అయితే 60 ఏళ్లుగా శ్రీరాముడిని టెంటు కింద ఎందుకు ఉంచారో చెప్పాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, కంచెట్టి గంగాధర్, అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు, మండల అధ్యక్షుడు భూతం సాయరెడ్డి, సురేందర్, వీరేశం, రమేశ్, రాజు తదితరులు పాల్గొన్నారు.