ఆర్మూర్, వెలుగు : బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, అధికారంలోకి రాగానే ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తో అవినీతి సొమ్మును కక్కిస్తామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. ఆర్మూర్ లో సోమవారం బీజేపీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి ఎంపీ ధర్మపురి అర్వింద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జీవన్ రెడ్డి అవినీతి అక్రమాలు గుట్టలా పెరిగిపోయాయని, భూములు, ఆర్టీసీ జాగాలను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి అయిదేండ్లు అధికారమిస్తే బీఆర్ఎస్ లీడర్ల అవినీతి అక్రమాలను బయటకు తీసి, మింగిన సొమ్మును కంకిస్తామన్నారు. గతంలో నీళ్లు, నిధులు, నియామకాలు అన్న బీఆర్ఎస్, ఎంత వరకు హామీలను అమలు చేశారో ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.
ఇదేమీ తెలియని జీవన్ రెడ్డి ప్రధాని మోదీపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయడం, విమర్శించడం సరికాదన్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డుపై నిజామబాద్ మీటింగ్ తెల్లారే పార్లమెంట్లో పసుపు బోర్డుపై ఆమోద ముద్ర వేయించారని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో వడ్లను ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్తే క్వింటాళ్ల కొద్ది తరుగు పేరుతో దోచుకున్నారని, బీజేపీ అధికారంలోకి రాగానే తరుగు లేకుండానే వడ్లు కొనుగోలు చేస్తుందన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించి చెరుకు రైతులను ఆదుకుంటామన్నారు. ఆర్మూర్ లో 40 వేల మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు.
ALSO READ : గంగులను గెలిపిస్తామని ఖాజీపూర్ గ్రామస్తుల తీర్మానం
పుణే ఎమ్మెల్యే సిద్ధార్థ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దోళ్ల గంగారెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు పైడి రాకేశ్రెడ్డి, కంచెట్టి గంగాధర్, ఆలూర్ విజయ భారతి, బద్దం లింగారెడ్డి, జెస్సు అనిల్, పాలెపు రాజు, యామాద్రి భాస్కర్, రోహిత్ రెడ్డి, ద్యాగ ఉదయ్, సాయికుమార్పాల్గొన్నారు.