వికారాబాద్​ కలెక్టర్​కు పరామర్శలు

వికారాబాద్​ కలెక్టర్​కు పరామర్శలు

వికారాబాద్, వెలుగు: వికారాబాద్  కలెక్టర్  ప్రతీక్ జైన్ ను బుధవారం మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్ది, ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్ది తదితరులు పరామర్శించారు. ముందుగా తిరుపతి రెడ్డి కొడంగల్  నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు సుమారు 300 మందితో కలిసి కలెక్టరేట్​కు వచ్చారు. వికారాబాద్  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్  రాజేశ్​రెడ్డి, నారాయణపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్  వార్ల విజయ్ కుమార్, బొంరాస్ పేట పీఏసీఏ చైర్మన్  జయకృష్ణ తదితరులతో కలిసి కలెక్టర్ ను తిరుపతి రెడ్డి పరామర్శించారు.

ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో బీఆర్ఎస్  లీడర్లు ఎన్ని కుట్రలు పన్నినా అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోలేరన్నారు. ఆయన వెంట తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్ది ఉన్నారు. పాలమూరు ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ కొడంగల్ ప్రాంత అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదన్నారు. బుధవారం లగచర్ల వెళ్తున్న ఆమెను మన్నెగూడ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో అనుచరులు, బీజేపీ  కార్యకర్తలతో కలిసి హైదరాబాద్– బీజాపూర్ హైవేపై పీఎస్​ ముందు బైఠాయించారు.

 దీంతో అడిషనల్​ఎస్పీ రవీందర్​రెడ్డి ఆమెకు పరిస్థితి వివరించగా..అది తన పార్లమెంట్ పరిధి అని, శుభకార్యాలు ఉన్నాయని చెప్పారు. సర్దిచెప్పగా వికారాబాద్  కలెక్టర్​ను కలిసి వెళ్తానని అనడంతో ఒప్పుకున్నారు. దీంతో వికారాబాద్​ వెళ్లి కలెక్టర్​ ప్రతీక్​జైన్​ను ఎంపీ పరామర్శించారు. అధికారులపై దాడులు కరెక్ట్​ కాదన్నారు. కంపెనీల ఏర్పాటు వల్ల ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. కంపెనీల ఏర్పాటుకు రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేనందున ప్రభుత్వ భూములు కంపెనీలకు కేటాయించాలని ఎంపీ సూచించారు.