పాలమూరు, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రిజర్వేషన్లు తీసేస్తారని కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేశారని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొదటిసారి జిల్లాకు వచ్చిన ఆమెకు బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన అనంతరం అన్నపూర్ణ గార్డెన్ లో ఓటర్ల కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హిందువుల పట్ల కాంగ్రెస్ వైఖరి ఏంటో తెలిసిపోయిందని చెప్పారు. పార్లమెంట్లో రాహుల్ గాంధీ హిందువులపై చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు.
హిందువులు హింసకు పాల్పడతారని చేసిన వ్యాఖ్యలు బాధాకరమని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా, సీఎం నుంచి ఎమ్మెల్యే వరకు తనపై ఆరోపణలు చేశారని, అయినప్పటికీ ప్రజలు ఓట్లేసి గెలిపించారన్నారు. పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యమని, జూరాల నుంచి మహబూబ్నగర్ పార్లమెంట్ లోని ప్రతి అసెంబ్లీకి లక్ష ఎకరాలకు నీళ్లు అందించాలని సీఎంను కోరుతానని చెప్పారు.
ALSO Read : సంగారెడ్డి జిల్లాలో మందుల కొరతపై మంత్రి ఆగ్రహం
పాలమూరు అభివృద్ధి కోసం అందరితో కలిసి పని చేస్తానని స్పష్టం చేశారు, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి, రాష్ట్ర అధికార ప్రతినిధి కట్ట సుధాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, నాగురావ్ నామాజీ, పద్మజా రెడ్డి, శ్రీవర్ధన్ రెడ్డి, కొండయ్య, ఇగ్గని నరసింహులు, పడాకల శ్రీనివాస్, నరసింహారెడ్డి పాల్గొన్నారు.