![ఏపీ వాళ్లను తిట్టి KCR సీఎం అయితే.. కేసీఆర్ను తిట్టి రేవంత్ ముఖ్యమంత్రి అయ్యిండు: డీకే అరుణ](https://static.v6velugu.com/uploads/2025/02/mp-dk-aruna-fires-on-cm-revanth-reddys-government_5XKgTvHRyc.jpg)
జనగాం: కేసీఆర్ ఆంధ్రా వాళ్ళను తిట్టి సీఎం అయితే.. రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిట్టి ముఖ్యమంత్రి అయ్యాడని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. కానీ తిట్లు తిట్టి ముఖ్యమంత్రులైన వారిని ప్రజలెవరు హర్షించడం లేదన్నారు. సీఎం రేవంత్ ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాననుకుని మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. మంగళవారం (ఫిబ్రవరి 18) డీకే అరుణ జనగాంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కుల గణన సర్వేలో పాల్గొనకపోతే తెలంగాణ నుంచి బహిష్కరిస్తామన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
కులగణనలో పాల్గొనని వారిని తెలంగాణ నుండి బహిష్కరిస్తామని అనడానికి రేవంత్ రెడ్డి ఎవరు..? అలా చేయడానికి ఆయనకు ఉన్న హక్కు ఏంటి..? అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే రేవంత్ రెడ్డినే తెలంగాణ నుంచి ప్రజలు బహిష్కరిస్తారని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. కులగణన సర్వేలో వ్యక్తిగత వివరాలు, ఆస్తులతో పాటు.. ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వారు అన్న వివరాలు ఎందుకు సేకరిస్తున్నారని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో ప్రజలు ఎక్కడెక్కడ నుంచో వచ్చి భయంతో సర్వేలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ సర్వే రిపోర్టును ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నిస్తోన్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది వాళ్లేనని.. మరీ ఇప్పుడు ఎందుకు కేసీఆర్ చేసిన సర్వే నివేదికను బయట పెట్టడం లేదని నిలదీశారు డీకే అరుణ. ఇక, పార్టీ హై కమాండ్ ప్రొసీజర్ ప్రకారం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి వచ్చిన కలిసి పని చేస్తామన్నారు.