మోదీతోనే దేశంలో సుస్థిర పాలన : ఎంపీ డీకే అరుణ

మోదీతోనే దేశంలో సుస్థిర పాలన : ఎంపీ డీకే అరుణ

షాద్ నగర్,వెలుగు: ఉమ్మడి పాలమూరు అభివృద్ధికి కృషి చేస్తానని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ హామీ ఇచ్చారు.  ఎంపీగా విజయం సాధించి పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా ఆమె గురువారం మహబూబ్ నగర్ కు వచ్చారు. అంతకుముందుగా కొత్తూరులో బీజేపీ నేతలు ఎంపీకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె తిమ్మాపూర్ లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కొత్తూరులో పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ.. లక్ష్మి దేవిపల్లి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తానని తెలిపారు. దేశానికి సుస్థిర పాలన అందించాలంటే ప్రధాని మోదీతోనే  సాధ్యమని పేర్కొన్నారు. పార్లమెంట్ లో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు దేశంలోని హిందువులను కించపరిచేలా ఉన్నాయని ఆరోపించారు. బీజేపీ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, అందె బాబయ్య, బీజేపీ నేతలు ఉన్నారు.